ఆ సీనియ‌ర్ నేత‌కు కేసీఆర్ రెండు బంప‌ర్ ఆఫ‌ర్లు… పోటీ ఎక్క‌డో ?


తెలంగాణ‌లో ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం హాట్ హాట్‌గా ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఊహించని విధంగా ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో పాటు ఆయ‌న శాఖ‌ల‌కు కూడా కేసీఆర్ తీసేసుకున్నారు. ఇక ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం హుజూరాబాద్‌లో ప‌రిణామాలు కూడా శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఉన్న పోలీసులు, ఎంఆర్వోలు, ఎంపీడీవోలు అంద‌రూ మారిపోతున్నారు. ఈట‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మాట ఎంత‌మాత్రం చెల్లుబాటు కాకుండా చేసేశారు. ఇప్పుడు అక్క‌డ అధికారులు అంద‌రూ టీఆర్ఎస్ అధిష్టానం కంట్రోల్లోనే ఉన్నారు. ఇక‌పై పేరుకు మాత్ర‌మే ఈట‌ల అధికార పార్టీ ఎమ్మెల్యే… ఆయ‌న చెప్పింది ఏదీ కూడా అక్క‌డ జ‌ర‌గ‌దు. హుజూరాబాద్‌కు స‌మాంత‌రంగా ఈట‌ల శిష్యుడు ఇన్‌చార్జ్‌గా ఉన్న పెద్ద‌ప‌ల్లి జ‌డ్పీచైర్మ‌న్‌, మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ పుట్టా మ‌ధుకు కూడా పార్టీ అధిష్టానం షాకులు ఇస్తోంది. మంథ‌నిలో కూడా మ‌ధుకు పూర్తిగా చెక్ పెట్టేస్తున్నారు.

ఇక మిగిలింది ఈట‌ల పార్టీకి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డ‌మే ? ఈట‌ల తెలంగాణ‌లో త‌న‌తో క‌లిసి వ‌చ్చే నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. వీరితో పాటు త‌న అనుచ‌రుల‌తో క‌లిసి చ‌ర్చించుకున్నాకే ఆయ‌న పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఈట‌ల ప‌ద‌విని వ‌దులుకుంటే ఆరు నెల‌ల్లోనే తెలంగాణ‌లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావ‌డం ఖాయం. ఎలాగైనా ఉప ఎన్నిక వ‌స్తే ఈట‌ల‌ను ఓడించి ఆయ‌న రాజ‌కీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేయాల‌న్న‌దే కేసీఆర్ స్కెచ్‌. ఈ క్ర‌మంలోనే హుజూరాబాద్‌పై ఇప్ప‌టి నుంచే ఆప‌రేన్ ప్రారంభ‌మైంద‌ని అక్క‌డ ప‌రిణామాలు చెప్పేస్తున్నాయి.

వినోద్ వేముల‌వాడ టు హుజూరాబాద్ ?
వాస్త‌వంగా మాజీ ఎంపీ, ప్ర‌స్తుత ప్ర‌ణాళికా సంఘం స‌ల‌హా చైర్మ‌న్ బి. వినోద్‌కుమార్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ బ‌రిలో నిల‌వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఆయ‌న మంత్రి ప‌ద‌వే టార్గెట్‌గా పెట్టుకుని ప‌ని చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌రీంన‌గ‌ర్ ఎంపీగా పోటీ చేసి బండి సంజ‌య్ చేతిలో ఓడిపోయారు. అయినా కేసీఆర్ ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇక వేముల‌వాడ‌లో వ‌రుస‌గా నాలుగు సార్లు గెలుస్తూ వ‌స్తోన్న ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్‌బాబు ఇప్ప‌టికే పౌర‌స‌త్వ వివాదంలో ఉన్నారు. ఆయ‌న గ‌త యేడాది కాలంగా జ‌ర్మ‌నీలోనే ఉంటున్నారు. ఆయ‌న జ‌ర్మ‌నీ యువ‌తిని వివాహం చేసుకోవ‌డంతో అక్క‌డే ఉంటున్నారు. అస‌లు ర‌మేష్‌బాబు గ‌త ప‌దిహేనేళ్లుగా వేముల‌వాడ‌కు ఎమ్మెల్యేగా ఉంటున్నా ఆయ‌న ఇక్క‌డ ఉన్న‌ది త‌క్కువే.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను త‌ప్పించేయాల‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందుకే వినోద్‌కుమార్‌ను ఇప్ప‌టి నుంచే అక్క‌డ వ‌ర్క్ ప్రారంభించాల‌ని చెప్ప‌డంతో గ‌త ఆరు నెల‌లుగా వినోద్ అక్క‌డ ప‌ని ప్రారంభించ‌డంతో పాటు అధికారుల‌ను గ్రిప్‌లోకి తెచ్చుకుని కార్య‌క‌ర్త‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేముల‌వాడ‌లో వినోద్ పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని నిన్న‌టి వ‌ర‌కు పార్టీ వ‌ర్గాలు చెప్పాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ వినోద్‌ను హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉండాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈట‌ల‌కు హుజూరాబాద్ కంచుకోట‌… అలాంటి చోట పోటీ చేసేందుకు వినోద్ అయిష్టంగానే ఉన్నార‌ట‌.

అయితే కేసీఆర్ మాత్రం ఈట‌ల‌ను ఓడించడ‌మే టార్గెట్‌గా వినోద్‌కు అక్క‌డ బాధ్య‌తలు అప్ప‌గించేందుకు రెడీగా ఉన్నార‌ట‌. మ‌రి వినోద్ ఉప ఎన్నిక‌ల్లో ఈట‌ల‌తో పోటీకి సై అంటారా ? లేదా వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో వేముల‌వాడ నుంచే తన అదృష్టం ప‌రీక్షించుకుంటారా ? అన్న‌ది చూడాలి.