అనంతపురంలో 1500 పడకలతో యుద్ధ ప్రాతిపదికన కొవిడ్ ఆసుపత్రి సిద్ధమవుతోందంటూ ఏడాది కిందట ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ విజయసాయి ట్విట్టర్లో ఘనంగా ఒక ప్రకటన చేశారు. ఆసుపత్రిగా మారుతున్న గోడౌన్ ఫొటోలను సైతం షేర్ చేశారు. పది నెలలు గడిచాయి. ఆసుపత్రి ఆచూకీ తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ట్విట్టర్లో విజయసాయి చాలా దూకుడుగా ఇలాంటి ప్రకటనలు చేసేస్తుంటారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉంటాయి. ఒకసారి రెండుసార్లు కాదు.. సాయిరెడ్డి ట్వీట్లు అల్లరిపాలైన సందర్భాలు కోకొల్లలు. తాజాగా మరో ఘనమైన ప్రకటనతో ఆయన జగన్ సర్కారు గురించి గొప్పలు పోయారు.
“రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 309 కోట్లు కేటాయించి సిఎం జగన్ గారు ప్రజల పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలతో పాటు 50 క్రయోజనిక్ ట్యాంకర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక ప్రాణవాయవుకు కొరత ఉండదు” ఇదీ సాయిరెడ్డి వేసిన ట్వీట్. ఆయనిలా గొప్పలు పోయిన కొన్ని గంటల్లోనే తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో ఘోరం జరిగిపోయింది. అక్కడ ఆక్సిజన్ ప్లాంటులో నిల్వలు తగ్గి రోగులకు సరఫరా ఆగిపోయి నిమిషాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య తగ్గించి చెబుతున్నారని, ఇంకా ఎక్కువమందే చనిపోయి ఉండొచ్చని అంటున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగానూ మారింది.
ఈ ఘోర ఉదంతం చోటు చేసుకున్న వెంటనే ట్విట్టర్లో సాయిరెడ్డి మీద నెటిజన్లు యుద్ధం మొదలుపెట్టారు. మీ మాటలకు, ప్రభుత్వ చేతలకు పొంతన ఉండదంటూ ఆయన్ని దుయ్యబట్టారు. కొవిడ్‌తో రాష్ట్రంలో కల్లోలం నెలకొన్న పరిస్థితుల్లో పరిష్కారాల గురించి ఆలోచించకుండా అదే పనిగా విజయసాయిరెడ్డి ట్విట్టర్లో రాజకీయ విమర్శలు చేయడం పట్ల కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates