తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కొత్త ఈక్వేషన్ ఎంట్రీ ఇస్తోంది. ఈ కొత్త ఈక్వేషన్లు వర్కవుట్ అవుతాయా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే… రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సరికొత్త చర్చకు మాత్రం తెర లేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల కొత్త పార్టీ పేరిట ఎంట్రీ ఇవ్వగా… తాజాగా టీఆర్ఎస్ కు దూరమైపోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సరికొత్త రాజకీయం చేయనున్నట్లుగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పుడు మరో కొత్త ఈక్వేషన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచే వేరుపడిన ఈటల, కొండాలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారట. అంతేకాకుండా కేసీఆర్ కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు కూడా ఈ కొత్త శిబిరంతో టచ్ లోకి వచ్చారట.
ఈ ఈక్వేషన్ ను ఎవరో రాజకీయ విశ్లేషకుడో, ఏ మీడియా సంస్థనో ఊహించింది కాదు. స్వయంగా కొండా విశ్వేశ్వరరెడ్డే ఈ ఈక్వేషన్ ను వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా విశ్వేశ్వరెడ్డి పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ దిశగా కొండా ఏమన్నారంటే… తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయపార్టీ అవసరముందని కొండా అభిప్రాయపడ్డారు. అటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాను, ఈటల మరికొంత మంది ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
కేసీఆర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా…కేసీఆర్ కేబినెట్లోని ఇద్దరు మంత్రులు తమతో టచ్లో ఉన్నారని సరికొత్త బాంబు పేల్చారు. టీఆర్ఎస్పై పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీలు లేవన్నారు. తమ ఆలోచనలకు రేవంత్రెడ్డి మద్దతు కూడా ఉందని చెప్పారు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు. షర్మిలకు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకోవడంలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.