కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రాణవాయువు అందక జనం ఊపిరి ఆగిపోతోంది. ఎక్కడ కరోనా సోకుతుందో? ఎక్కడ తమకు ప్రాణవాయువు అందక ఇబ్బంది పడాల్సి వస్తుందోనన్న భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.
ఇలాంటి తరుణంలో అవసరమైన ఏ ఒక్కరికి కూడా ఆక్సిజన్ అందలేదన్న మాటే వినరాదన్న దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఏపీకే ఊపిరి పోసేలా ఉన్న ఈ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
ఏపీలోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు వదులుతున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన దేశంలో ఈ తరహా ఘటనలు ఒకింత అధికంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మీదట ఆక్సిజన్ లేక మనిషి ప్రాణాలు పోగొట్టు కునే పరిస్థితి రాకూడదనే ఆశయంతో జగన్ సర్కార్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది.
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. అలాగే 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్‌లైన్ల ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం జిల్లాకు రూ.10 లక్షల చొప్పున .. 6 నెలలకు రూ.60 లక్షలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకూ పడిన ఇబ్బందులను పక్కన పెడితే, ఇక మీదట ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం కాకుండా సత్వర చర్యలు చేపట్టడం అభినందనీయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.