జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలిస్తున్నారో తెలీటంలేదు. ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం గడచిన రెండేళ్ళల్లో అనేక కేసులు నమోదుచేసింది. అయితే ఇందులో కొన్నింటిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుండా కోర్టు అడ్డుకున్నది. దాంతో ప్రభుత్వం పరువు కాస్త కృష్ణానదిపాలవుతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా కర్నూలు పోలీసులు చంద్రబాబునాయుడుపై క్రిమినల్ కేసుపెట్టారు.
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కు సంబంధించి ఎన్ 440 కే అనే ప్రమాదకర వేరియంట్ సోకిందని చంద్రబాబు మీడియా సమావేశంలో పదే పదే చెబుతున్నారు. ఒకవైపు చంద్రబాబు చెబుతున్న వేరియంట్ ప్రమాదకరం కాదని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు చెబుతున్నా చంద్రబాబు వినటంలేదు. సరే చంద్రబాబు చెబుతున్నదానిలో, చేస్తున్న ఆరోపణలు 90 శాతం రాజకీయమైనవే. రాజకీయాలన్నాక ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. ఇందులో బేసుండదు, ఆరోపణలు చేసేవారు ఆధారాలు కూడా చూపరు.
జస్ట్ ప్రభుత్వంపై బురదచల్లేసి వదిలేస్తారంతే. ఇపుడు ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబు అండ్ కో చేస్తున్నదిదే. అయితే దీనికి జగన్ పెద్దగా స్పందించాల్సిన అవసరమైతే లేదు. ప్రతిపక్షాలు చెబుతున్నదానిలో ఏదైనా ఆచరణాత్మకమైన సలహాలు ఉందని ప్రభుత్వం అనుకుంటే తీసుకోవచ్చు లేకపోతే వదిలేయవచ్చు. అంతేకానీ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను బేస్ గా తీసుకుని వారిపై కేసులు పెట్టడం వల్ల అంతగా ఉపయోగం ఉండదు. ఇలాంటి కేసులు కోర్టుల్లో పెద్దగా నిలబడవు.
ఇప్పటికే మాజీ ఎంఎల్ఏ దూళిపాళ నరేంద్ర పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిలిపేస్తు కోర్టు తాజాగా ఆదేశించింది. సంఘం డైరీ నిర్వహణలో నరేంద్ర అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ కేసులు నమోదుచేసి అరెస్టు చేసింది. మరి విచారణలో ఏసీబీ ఆరోపణలు ఏమేరకు నిలబడతాయో చూడాలి. అంతకుముందు మార్ఫుడు వీడియోతో జగన్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపైన సీఐడి పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.
అంతకుముందే ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు, హత్యకేసులో మరో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, ట్రాన్స్ పోర్టు అక్రమాల్లో మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డిపైన కూడా పోలీసులు కేసులు పెట్టి అరెస్టు జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఎవరిపైనైనా కేసు పెట్టాలంటే పక్కా ఆధారాలు సేకరించి బెయిల్ కూడా రాని పద్దతిలో ఉండాలి. తప్పుచేసిన వాళ్ళని వదలాల్సిన అవసరం లేదు. అలాగని రాజకీయంగా గాలి మాటలు మాట్లాడేవాళ్ళపై కేసులు కూడా అవసరంలేదు. ఎందుకంటే ఊరికే ప్రభుత్వం అప్రదిష్ట మూటకట్టుకోవటం మినహా ఒరిగేదేమీ ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates