ప్ర‌ధాని మోడీపై సుప్రీంకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

కేంద్ర ప్ర‌భుత్వంపై సుప్రీం కోర్టు మ‌రోసారి ఫైరైంది. ప్ర‌స్తుతం దేశాన్ని చుట్టుముట్టి.. క‌రోనా సెకండ్ వేవ్‌ను అడ్డుకోవ‌డంలోను, ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్య స‌దుపాయాలు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వంటి విష‌యాల్లో మోడీ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని సుప్రీం కోర్టు మ‌రోసారి సీరియ‌స్‌గా వ్యాఖ్యానించింది. దేశంలో క‌రోనా ప‌రిస్థితులు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వంటి ప‌లు అంశాల‌పై.. సుమోటోగా విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం కోర్టు.. తాజాగా మ‌రోసారి.. దీనిపై విచార‌ణ జ‌రిపింది.

ఈ సంద‌ర్భంగా కేంద్రం స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ స‌హా.. ప‌లు రాష్ట్రాలు.. త‌మ‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయడం లేదంటూ.. కొంద‌రు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో వేసిన కేసుల‌ను కూడా సుప్రీం కోర్టు సుమోటోగా విచార‌ణ చేప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో థ‌ర్డ్ వేవ్‌పై సుప్రీం కోర్టు మ‌రింత ఆదోంళ‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వం ఏమేర‌కు స‌న్న‌ద్ధంగా ఉంద‌ని.. ప్ర‌శ్నించింది. ముఖ్యంగా థ‌ర్డ్ వేవ్‌లో చిన్నారుల‌పై ఎక్కువ‌గా ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్న నిపుణుల హెచ్చ‌రిక‌ల‌ను కూడా సుప్రీం కోర్టు ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది.

వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిలో కేంద్రం ఎలా స‌హ‌క‌రిస్తోందో చెప్పాల‌ని కూడా నిల‌దీసింది. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాను మ‌రింత‌గా పెంచాల‌ని సూచించిన సుప్రీం కోర్టు.. థ‌ర్డ్‌వేవ్‌ను త‌ట్టుకునేందుకు చిన్నారుల‌కు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు సూచించింది. అదేస‌మయంలో ఢిల్లీకి మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది.