పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. మమతబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస 213 సీట్లతో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 213 మందిని ఒంటిచేత్తో గెలిపించుకున్న మమత చివరకు తాను పోటీచేసిన నందిగ్రామ్ లో ఓడిపోయారు. మమత ఓడిపోవటం ఇదే మొదటిసారి. మరి ఓడిపోయిన మమత సీఎం అయితే మళ్ళీ పోటీచేసి గెలవాలి కదా. ఇపుడీ విషయంపైనే పెద్దఎత్తున చర్చ మొదలైంది.
నందిగ్రామ్ రిజల్టుపై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. ఒకసారేమో బీజేపీ అభ్యర్ధి సుబేందు అధికారి గెలిచినట్లు చెప్పారు. కొంతసేపటికి లేదు లేదు మమత ఓడిపోలేదు గెలిచారని చెప్పారు. నందిగ్రామ్ ఓట్ల కౌంటింగ్ లో 18 రౌండ్ల లెక్కింత తర్వాత 1256 ఓట్లతో మమత గెలిచినట్లు ప్రచారం జరిగింది. అప్పటికే తృణమూల్ అఖండ మెజారిటి రావటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు మొదలుపెట్టేశారు.
ఈ నేపధ్యంలోనే మమత గెలవలేదు సుబేందు చేతిలో 1956 ఓట్లతో ఓడిపోయారంటు ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో మమత కూడా తన ఓటమిని అంగీకరించటంతో పాటు ఎన్నికల కమీషన్ పై ఆరోపణలు చేయటంతో గందరగోళం మొదలైపోయింది. తర్వాత కాసేటప్పటికి ఎన్నికల కమీషన్ అధికారికంగా సుబేందు గెలుపును ప్రకటించింది. అయితే మమత మాట్లాడుతు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓడిపోయిన మమత సీఎంగా బాధ్యతలు స్వీకరించినా ఆరునెలల్లో ఎక్కడో ఓ చోటనుండి గెలవాలి. మరి ఎక్కడ నుండి పోటీచేస్తారు ? మమత పోటీచేయటానికి సీటు ఖాళీగా ఉండాలి కదా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మమత పోటీ చేయటానకి మూడుస్ధానాలు ఖాళీగా ఉన్నాయి. 294 అసెంబ్లీలున్న బెంగాల్లో మూడు సీట్లు ఖాళీ అయిపోయాయి.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహా స్ధానంలో తృణమూల్ తరపున పోటీచేసిన కాజల్ సిన్హా గెలిచారు. అలాగే జంగీపూర్ నియోజకవర్గంలో ఆర్ఎస్పీ అభ్యర్ధి, శంషేర్ గంజ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి మరణించారు. వీళ్ళంతా నామినేషన్లు వేసిన తర్వాత ప్రచారంలో ఉండగా చనిపోయారు. అయితే ఖర్దాహా నియోజకవర్గంలో కాజల్ మాత్రం పోలింగ్ అయిన తర్వాత చనిపోయారు. తాజా ఫలితాల్లో కాజల్ గెలిచారు కూడా. కాబట్టి మమత పోటీచేయటానికి మూడు సీట్లు రెడీగా ఉన్నాయి. ఎలాగూ తృణమూల్ గెలిచిన సీటే కాబట్టి మమత ఇక్కడి నుండే పోటీచేసే అవకాశాలున్నాయి.