ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు, మరణాలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్లు కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజుకు 10 వేలకు పైనే నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే.. రాష్ట్రంలో 23 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 84 మంది మృతి చెందారు. ఇది వాస్తవానికి అధికారిక లెక్క. కానీ, అనధికారికంగా మరింత మంది మృతి చెంది ఉంటారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా.. రాష్ట్ర వ్యాప్తంగా.. ప్రబుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటోంది. అయితే.. చాలా సేవలకు వెసులుబాటు ఇవ్వడంతోపాటు.. రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజలను అనుమతిస్తుండడంతో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గకపోగా.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో సారి ఈ కర్ఫ్యూను పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది.
అయితే.. ఇప్పటికీ.. ఈ కర్ఫ్యూ విషయంలో సర్కారు సీరియస్‌గా తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. దాదాపు అన్నంటికీ రిలాక్సేషన్ ఇస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయని అంటున్నాయి. అయితే.. ఇప్పుడు విధించిన కర్ఫ్యూలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. అదేసమయంలో ఉదయం 6-12 గంటల వరకు మాత్రమే.. దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే.. ఈ సమయంలోనూ 144 సెక్షన్ అమలు చేయనున్నట్టు సర్కారు స్పష్టం చేయడం గమనార్హం. మరి ఈ చర్యలతో అయినా.. కరోనా కంట్రోల్ అవుతుందో లేదో చూడాలి.