కేసీఆర్ సంచలనం.. మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్

అనుకున్నదే జరిగింది. అంచనాలు ఎక్కడా తప్పని రీతిలో.. ఎలాంటి ట్విస్టులకు అవకాశం ఇవ్వకుండా.. తాను అనుకున్న షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈటల రాజేందర్ పైన. ఇరవైఏళ్లుగా తనకు సన్నిహితంగా ఉండే ఈటల విషయంలో గడిచిన వారంగా గుర్రుగా ఉంటున్న ఆయన.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటానికి శుక్రవారం సాయంత్రాన్ని ముహుర్తంగా ఎంచుకున్నారు.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన వెంటనే.. తమ సొంత చానల్ తో పాటు.. తనకు సన్నిహితంగా ఉండే చానళ్లలో ఈటల భూకబ్జా భాగోతం పేరుతో బ్రేకింగ్ స్టోరీ ప్లే చేయటం.. తర్వాతి రోజు తమ పత్రికలో భారీ కథనాలు అచ్చేయటంతో పాటు.. ఈటల ఎంత దుర్మార్గుడు.. ఆయన తీరు ఎంత దారుణంగా ఉంటుందన్న విషయాన్ని తెలంగాణ సభ్య సమాజానికి సరికొత్త పద్దతిలో తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈటల మీద వచ్చిన ఆరోపణలపై యుద్ధప్రాతిపదికన స్పందించిన ఆయన.. వెనువెంటనే నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోపణలు వచ్చిన 24 గంటల కంటే ముందే.. వైద్య ఆరోగ్య శాఖను ఈటల నుంచి తప్పించిన ఆయన.. రెండు రోజులు గడిచేసరికి మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఘన విజయాన్ని అందుకొని.. క్యాడర్ మొత్తం సంతోషంగా ఉన్న వేళలో.. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తనను ఛీ కొట్టి పార్టీ నుంచి బయటకు గెంటేసే వరకు.. జరిగే పరిణామాల్ని చూడటమే తప్పించి.. పెద్దగా స్పందించకుండా ఉంటున్న ఈటల.. తనకు తాను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. నిజానికి ఆత్మాభిమానం.. ఆత్మగౌరవం చాలా ఎక్కువని తన గురించి తాను చెప్పుకున్న ఈటల.. ఆరోపణలు వచ్చినంతనే స్పందించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆచితూచి అన్నట్లు.. అవసరమైనప్పుడు మాత్రమే రియాక్టు అవుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే పరిణామాలన్ని తెలుసన్న రీతిలో ఉంటున్న ఆయన.. అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాఖ్య చేయటం మినహా.. పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఎలా రియాక్టు అవుతారో చూడాలి.