వచ్చే నెలలో అధికార వైసీపీ ఖాతాలో మూడు ఎంఎల్సీలు జమకాబోతోంది. మే నెల 24వ తేదీన ముగ్గురు ఎంఎల్సీల పదవులు ముగియబోతున్నాయి. ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్, టీడీపీ ఎంఎల్సీ ఎంఏ షరీఫ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోమువీర్రాజు, వైసీపీ ఎంఎల్సీ డీసీ గోవిందరెడ్డి పదవీకాలం అయిపోతోంది. వీరిలో డీసీ గోవింద రెడ్డికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో టర్మ్ రెన్యువల్ చేస్తారని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుత పరిస్ధితుల్లో షరీఫ్, వీర్రాజులు మాత్రం రిటైర్ అవ్వాల్సిందే.
వీళ్ళద్దరి రిటైర్మెంట్ తో ఖాళీ అయ్యే స్ధానాలు వైసీపీ ఖాతాలోనే జమవుతాయి. ఎందుకంటే ఈ మూడుస్ధానాలు ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన స్ధానాలు కాబట్టే. అసెంబ్లీలో వైసీపీ, టీడీపీల బలాబలాలు చూసుకుంటే మే నెలనుండి ఖాళీఅయ్యే ప్రతి ఎంఎల్సీ స్ధానము వైసీపీకే దక్కుతుంది. టీడీపీకి మొన్నటి సాధారణ ఎన్నికల్లో వచ్చింది 23 మంది ఎంఎల్ఏలే కాబట్టి ఇక ఎంఎల్సీ స్ధానాలను గెలుచుకునే అవకాశలు ఏకోణంలో కూడా లేదనే చెప్పాలి.
ఎంఎల్ఏ కోటా అనే కాదు స్ధానికసంస్ధల కోటా, గవర్నర్ నామినేషన్ పద్దతిలో చూసినా టీడీపీకి ఒక్క ఎంఎల్సీ కూడా దక్కదు. సరే ప్రస్తుతానికి వస్తే గోవిందరెడ్డికి మరో టర్మ్ రెన్యువల్ అయితే మిగిలిన రెండుస్ధానాలను ఎస్సీ, బీసీలకు కేటాయిస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటిలు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇక్కడో ట్వస్టుంది. అదేమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడే గుంటూరు నేత మర్రి రాజశేఖర్ కు జగన్ మంత్రివర్గంలో చోటిస్తానని హామీఇచ్చున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేటలో పోటీచేయాల్సింది రాజశేఖరే. కానీ చివరి నిముషంలో విడదల రజని టికెట్ తెచ్చుకుని పోటీచేసి గెలిచారు. అధికారంలోకి రాగానే ఎంఎల్సీని చేస్తానని జగన్ హామీ ఇచ్చినా ఎందుకనో వాయిదా వేస్తున్నారు.
కాబట్టి ఈసారైనా మర్రికి ఎంఎల్సీగా అవకాశం దక్కుతుందా అనే విషయమై పార్టీలో చర్చ జరుగుతోంది. మేలో కుదరకపోయినా జూన్ లో చాలా స్ధానాలే ఖాళీ అవుతాయి. కాబట్టి వాటిల్లో మర్రికి ఖాయంగా ఒకటి దక్కుతుందనే అనుకుంటున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.