వారాంతంలో తనకు తెలిసిన సమాచారాన్ని.. తాను అనుకున్న విషయాన్ని.. తనకు తానుగా ఎంపిక చేసుకున్న ఎజెండాను తన అక్షరాల రూపంలో సంధించే ఆంధ్రజ్యోతి యజమాని ఆర్కే.. ఒక వారం తన ఆర్టికల్ కు విశ్రాంతి ఇచ్చారు. ఆయన కుటుంబంలోని వారి ఆరోగ్య సమస్యల కారణంగా.. ఆయన దేని మీదా ఫోకస్ చేయలేకపోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తాను రాసిన వీకెండ్ కామెంట్ లో ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.
ఏపీ రాజకీయాల విషయంలో ఆర్కే స్టాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో కరోనా కేసుల తీవ్రతతో పాటు..అధికారపక్షం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఓపక్క మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలోనూ.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో బదులు తీర్చుకునేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గని వైనం కనిపిస్తుందన్నారు.
టీడీపీ నేతలందరిని ఏదో ఒక కేసులో ఇరికించాలన్న తపన జగన్ లో ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. జగన్ రెడ్డి ప్రశాంతంగా నిద్ర పోవాలంటే.. రాష్ట్రంలో ఒక పని జరగాలంటూ ఆసక్తికర వాదనను వినిపించారు. అదేమిటన్నది ఆయన మాటల్లో చూస్తే..
- ముఖ్యమంత్రికి విశాల ప్రజాప్రయోజనాల కంటే తన రాజకీయ ప్రయోజనాలు, కక్ష సాధింపులే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాధి సోకుతున్న వారి సంఖ్య రోజుకు 12 వేలకు పెరిగినా అదేమీ పట్టని ప్రభుత్వం తెల్లవారకముందే వందల మంది పోలీసులను పంపి తెలుగుదేశం నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయించింది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన కేసును ఇప్పుడు తిరగదోడి నరేంద్రను హడావిడిగా అరెస్ట్ చేశారంటేనే ముఖ్యమంత్రిలో కక్ష సాధింపు వైఖరి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
- అధికారాన్ని ఈ స్థాయిలో దుర్వినియోగం చేయవచ్చునని గత పాలకులకు తెలియదు. నిజానికి రాజకీయాల్లో గతంలో కక్ష సాధింపు ధోరణులు ఉండేవి కావు. ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే ధోరణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అధికారానికి లొంగిపోతున్న ముఖ్యమంత్రులు తమ సొంత రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు.
- తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులందరినీ ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేసే వరకు జగన్‌రెడ్డికి నిద్ర పట్టేట్టు లేదు. ఆయన ప్రశాంతంగా నిద్రపోతే తప్ప రాష్ట్రంలో ప్రశాంతత ఉండదు. ఈ కారణంగా ముఖ్యమంత్రి హిట్‌లిస్టులో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ స్వచ్ఛందంగా జైలుకు వెళ్లడం మంచిది. తెలుగుదేశం నాయకులు అందరినీ ఒక మైదానంలో నిర్బంధించి దాన్నే ఓపెన్ ఎయిర్ జైలుగా మారిస్తే జగన్‌రెడ్డి శాంతించవచ్చు.