“నూతల పాటి వెంకట రమణ అనే నేను”.. అంటూ.. తెలుగు తేజం, ఏపీలోని కృష్ణాజిల్లా పొన్నవరం ప్రాంతానికి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది ప్రముఖులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు సిటింగ్ న్యాయమూర్తులు లావు నాగేశ్వరరావు సహా కేబినెట్ సెక్రటరీ, లా సెక్రటరీ, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు.. భౌతిక దూరం పాటిస్తూ కూర్చొన్నారు. మొత్తం కార్యక్రమం వందేమాతరంతో ప్రారంభమై.. జనగణమన.. గీతంతో ముగిసింది.
నిముషంన్నరలో..
కేవలం నిముషంన్నర సమయంలో జస్టిస్ ఎన్వీరమణ.. సీజేఐగా ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు. పూర్తి ఆంగ్లంలో ఉన్న ప్రమాణ పత్రాన్ని తొలుత.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చదవగా.. దానిని అనుసరిస్తూ.. జస్టిస్ ఎన్వీరమణ ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం సాగిందిలా..
“నూతలపాటి వెంకట రమణ అనే నేను. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాను. దేవునిపై ప్రమాణం చేసి.. రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన న్యాయవ్యవస్థపై విశ్వసనీయతను కలిగి ఉండి, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ఇనుమడింపజేస్తాను. విశ్వసనీయ, సమర్ధనీయ, విచక్షణ మేరకు తీర్పులు వెలువరుస్తానని, నా కార్యాలయ విధులను భీతి, పక్షపాతాలకు తావివ్వని విధంగా నిర్వర్తిస్తానని, రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను బలపరుస్తానని ప్రమాణం చేస్తున్నా”- అని జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates