తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్లే

తాజాగా ఏపీ సర్కారు ఒక ఎత్తిపోతల పథకాన్ని షురూ చేయటం.. దీనికి సంబంధించిన జీవో జారీ కావటం తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. తెలంగాణ హక్కులు భంగం వాటిల్లే ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించే ఎత్తిపోతల పథకంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలకు చెల్లుచీటి పడినట్లేనని భావించిన దానికి భిన్నమైన పరిస్థితి తాజాగా నెలకొంది. ఏపీ చేపట్టబోయే ఎత్తిపోతల పథకం తెలంగాణ సీఎం కేసీఆర్ కు కోపం తెప్పిస్తే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు కుట్ర కోణం కనిపించింది.

జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని హరీశ్ వాదిస్తున్నారు. 805 అడుగుల స్థాయిలో లిఫ్టు పెడుతున్నారంటే.. తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్లేనని చెబుతున్నారు. ఉన్నతస్థాయి కమిటీ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం దారుణమని ఆయన మండిపడుతున్నారు.

పోతిరెడ్డిపాటు సామర్థ్యంపై తాము నేటికి పోరాడుతూనే ఉన్నామని.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై గతంలోనే తాను క్రిష్ణా బోర్డుకు కంప్లైంట్ చేశామన్నారు. తాజాగా చేపట్టిన ఎత్తిపోతల పథకంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఏపీ సర్కారుపై ముఖ్యమంత్రికి కోపం వస్తే.. మంత్రి హరీశ్ కు మాత్రం కుట్ర కోణం కనిపించటం గమనార్హం.