లోకేష్‌కు ఓకే.. హైకోర్టుకు కూడా ఇలానే చెబుతారా?

రాష్ట్రంలో నెల‌కొన్న క‌రోనా తీవ్ర‌తను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని.. అదేవిధంగా ఇంట‌ర్ మీడియెట్ విద్యార్థుల‌కు కూడా త‌ర‌గ‌తులు ర‌ద్దు చేయాల‌ని.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్ స‌ర్కారుకు విన్న‌వించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి.. ప‌రిస్థితిని స‌మీక్షించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం క‌రోనా ను నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని.. ఎక్క‌డాస‌రైన వ‌స‌తులు కూడా లేవ‌ని.. రోగులు భారీ సంక్య‌లో చ‌చ్చిపోతున్నార‌ని.. ఆయ‌న ఆవేద‌న‌, ఆక్రోశం వ్య‌క్తం చేశారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా స్పందించిన విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌.. లోకేష్‌ను దుయ్య‌బ ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనాను ఎంత సీరియ‌స్‌ గా తీసుకుంటోందో.. క‌నిపించ‌డంలేదా? అని ప్ర‌శ్నించారు. లోకేష్ వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్న మంత్రి.. లోకేష్‌లో వ‌య‌సు త‌గ్గ ప‌రిణితి రాలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు.. మంత్రి సురేష్‌ కు కొన్నిప్ర‌శ్న‌లు సంధించారు. స‌రే.. లోకేష్ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్య‌లు చేసింది క‌దా.. మ‌రి ఏం చెబుతారు.. మేం చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.. మీకు క‌నిపించ‌డం లేదా?; అని అడుగుతారా? అని ప్ర‌శ్నించారు.

అంతే కాదు.. కోవిడ్ కేంద్రాల్లో ప్ర‌స్తుతం నెల‌కొన్ని దుర్భ‌ర ప‌రిస్థితులు. మౌలిక స‌దుపాయాల కొర‌త వంటి వాటి పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న‌వార్త‌ల‌ను, వీడియోల‌ను కూడా వారు పోస్ట్ చేశారు. వీటికి ఏం చెబుతారు మంత్రి వ‌ర్యా.. అని వ్యంగ్యాస్త్రాలుసంధిస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి.. విద్యార్థుల ప్రాణాలు కాపాడుతుంటే.. ఇక్క‌డ మాత్రం సందిగ్ధంలో పెట్టి.. వారిని తీవ్ర మ‌న‌క్షోభ‌కు గురిచేయ‌డం ఏమేర‌కు స‌మంజ‌సం.. అని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించ కుండా ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఎదురుదాడి చేయ‌డం త‌గ‌ద‌ని.. ప్ర‌జ‌లు సైతం హ‌ర్షించ‌ర‌ని అంటున్నారు. మ‌రి మంత్రిగారు ఆవేశం త‌గ్గించుకుంటారో లేదో .. చూడాలి.