తెలంగాణాలో ఇపుడందరి కళ్ళు వైఎస్ షర్మిల మీదే పడ్డాయి. తొందరలో జరగబోయే రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటి ఎన్నికల విషయంలో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఐదు మున్సిపాలిటిలు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, సిద్ధిపేట, అచ్చంపేటతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఈనెల 30వ తేదీన ఎన్నిక జరగబోతోంది.
స్టేట్ ఎలక్షన్ కమీషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేయగానే ఒక్కసారిగా ఎన్నికల వేడి మొదలైపోయింది. ఒకవైపు ఈనెల 17వ తేదీన జరగబోతున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల వేడి చల్లారుతుంది కదాని జనాలు అనుకున్నారు. అయితే హఠాత్తుగా గురువారం జారీ అయిన నోటిఫికేషన్తో ఎన్నికల వేడి మరికొన్ని రోజుల పాటు కంటిన్యు అవ్వక తప్పట్లేదు.
ఒకేసారి ఏడు మున్సిపాలిటల ఎన్నికలంటే మామూలు విషయం కాదు. కాబట్టి అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ ఎటూ పోటీలో ఉంటాయి. అయితే తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని, 2023లో అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్న షర్మిల ఏమి చేయబోతున్నారన్నదే ప్రశ్నార్ధకమైంది. ఎందుకంటే షర్మిల ఇప్పటివరకు రాజకీయపార్టీని ప్రకటించలేదు. కాబట్టి ఎన్నికల సంఘం దగ్గర నమోదు కూడా చేసుకోలేదు.
అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు తెలంగాణాలో పెద్దసంఖ్యలో అభిమానులు, మద్దతుదారులున్నారు. వీరుకూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీనంగర్, గ్రేటర్ హైదరబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కేంద్రీకృతమయ్యారు. మున్సిపాలిటీల సంగతి ఎలాగున్నా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో పోటీ చేయాల్సిందే అని షర్మిల మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారట. ఈ ఎన్నికల్లో పోటీచేస్తేనే షర్మిల పెట్టబోయే రాజకీయపార్టీకి జనాల మద్దతు ఎంతుందనే విషయం ఓ ట్రైలర్ లాగ పనిచేస్తుంది. మరి చూడాలి షర్మిల ఏమి చేస్తారో.