తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారు ? నిజానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నే. రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉన్న వారైనా వైసీపీనే గెలుస్తుందని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అయితే ఇదే ఉపఎన్నిక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో కూడా ఓ విధంగా జోష్ నింపిందనే చెప్పుకోవాలి. ఉపఎన్నికలో వైసీపీ గెలిస్తే ఓడిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబులో జోష్ ఎలా వస్తుంది ?
ఎలా వస్తుందంటే ఉపఎన్నికకు ముందు టీడీపీ పూర్తిగా నిస్తేజమైపోయింది. పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల ఫలితంగా పార్టీ నేతల్లో బాగా నైరాస్యం పెరిగిపోయింది. టీడీపీ పనైపోయిందనే ప్రచారం పార్టీలోనే పెరిగిపోతోంది. ఇదే సమయంలో తెలంగాణాలో పార్టీ తరపున ఉన్న ఇద్దరు ఎంఎల్ఏలు అధికారికంగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. వాళ్ళు చేరటమే కాకుండా టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో కలిపేశారు. దాంతో తెలంగాణాలో పార్టీ జెండా ఎత్తేసినట్లయ్యింది.
ఒకవైపు పార్టీపై దెబ్బమీద దెబ్బ పడుతున్న సమయంలోనే చంద్రబాబు తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలోకి దిగారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి. ఇపుడు ఆ ఓట్లు తెచ్చుకుంటే అదే మహా భాగ్యమన్నట్లుగా ఉంది పరిస్ధితి. అయితే ఆ ఓట్లు తెచ్చుకుంటుందా లేదా అన్నది పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు ప్రచారం చేసిన వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు నియోజకవర్గాల్లో జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు.
వచ్చిన వాళ్ళంతా ఓట్లేస్తారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే చంద్రబాబు పర్యటనకు జనాలు బాగా స్పందించటమే ముఖ్యం. ప్రచారంలో ఎంత రాత్రయినా జనాలు ఓపిగ్గా వెయిట్ చేయటం చంద్రబాబులో జోష్ నింపిందనటంలో సందేహంలేదు. ఇపుడు ప్రచారంలో జనాల స్పందన గనుక లేకపోయుంటే చంద్రబాబు సంగతి ఎలాగున్నా నేతలు మాత్రం పూర్తిగా నీరసపడిపోయుంటారనటంలో సందేహంలేదు. గెలుపోటములను పక్కనపెట్టేస్తే చంద్రబాబు పర్యటనకు జనాల్లో విశేష స్పందన కనిపించటం పార్టీలో మంచి జోష్ నింపిందనే చెప్పాలి.