వైసీపీ గెలిస్తే టీడీపీని మూసేస్తారా ?

రాజకీయంగా సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలైనాక అసెంబ్లీలో తీర్మానం చేయాలట. తీర్మానం తర్వాత రెండుపార్టీల ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలట. అప్పుడు వైసీపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీని మూసేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. మరి అచ్చెన్న సవాలుకు చంద్రబాబునాయుడు అనుమతి ఉందో లేదో తెలీదు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయంగా చేసుకునే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు ఎక్కడా, ఎప్పుడు ఆచరణలోకి వచ్చిన దాఖలాలు లేవు. అనవసరంగా ఎన్నికల హీట్ పెంచటం కోసమే ఇలాంటివి తెరపైకి వస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వెంటనే రాజీనామా చేయాలంటు ఇప్పటికి చంద్రబాబునాయుడు అండ్ కో కొన్ని వందలసార్లు డిమాండ్ చేసుంటారు. జగన్ రాజీనామా చేయరని తెలిసీ పదే పదే అవే డిమాండ్లు చేయటంలో ఉద్దేశ్యం ఏమిటి ?

ప్రత్యేకహోదా సాధించనందుకు వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతకుముందు ఇదే డిమాండ్ ను జగన్ చేసినపుడు చంద్రబాబు స్పందించలేదు. ముందు వైసీపీ ఎంపిలను రాజీనామాలు చేయమన్నారు. దాంతో తన ఐదుగురు ఎంపిలతో జగన్ రాజీనామా చేయించారు. దాంతో ఏం మాట్లాడాలో అర్ధంకాని చంద్రబాబు అండ్ కో వెంటనే వైసీపీ ఎంపిల రాజానామాల డిమాండ్ అంతా డ్రామాలంటు కొత్త డ్రామాకు తెరతీశారు.

కాలం జోరుగా తిరిగిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారపార్టీ ఎంపిల రాజీనామాకు పదే పదే డిమాండ్ చేస్తోంది. అప్పట్లో తన ఎంపిలతో జగన్ రాజీనామాలు చేయించినట్లే ఇపుడు చంద్రబాబు కూడా చేయించవచ్చు. కానీ ఆపని మాత్రం చేయటంలేదు. ఇపుడు తిరుపతి ఉపఎన్నికల సమయంలో రాజీనామాల ప్రస్తావన మొదలైంది. తాము ఓడిపోతే తమ ఎంపిలందరు రాజీనామాలు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు.

ఒకవేళ వైసీపీ గెలిస్తే టీడీపీ నలుగురు ఎంపిలు అంటే వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుతో కలిపి రాజీనామాలు చేస్తారా ? అన్నది పెద్దిరెడ్డి సవాలు. ఇష్టముంటే దానికి సమాధానం చెప్పాలి లేకపోతే లేదు. అంతేకానీ ఎంఎల్ఏలందరం రాజీనామాలు చేద్దామంటూ అచ్చెన్న సవాలు విసరటం విచిత్రంగా ఉంది. ఉపఎన్నికలో తమదే అఖండ విజయమని అచ్చెన్న పదే పదే చెబుతున్నారు. మరదే నిజమైతే పెద్దిరెడ్డి సవాలును అంగీకరిస్తే సరిపోతుంది కదా.