తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెడుతోన్న వైఎస్. షర్మిల ఖమ్మం వేదికగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. షర్మిల తన తొలి స్టెప్‌ను చాలా తెలివిగా వేశారన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. షర్మిల నిన్నటి వరకు సుతిమెత్తని విమర్శలు చేస్తూ వచ్చినా ఇప్పుడు నేరుగా అటు టీఆర్ఎస్ సర్కార్‌తో పాటు తెలంగాణకు బీజేపీ ఏం చేయలేదన్న విమర్శలు స్టార్ట్ చేసేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం విపక్షాలు ఏ మాత్రం ప్రస్తావించని… నిరుద్యోగుల అంశాన్ని ముందుగా భుజానికెత్తుకున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ఎంతో మంది యువకులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామన్న ఆవేదనలో ఉన్నారు. ఇటీవల కొందరు నిరుద్యోగ యువకులు సైతం ఆత్మహత్యలకు పాల్పడడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వాస్తవంగా దీనిని ప్రతిపక్షాలు సరిగా క్యాష్ చేసుకుని ఉంటే వారికి మంచి మైలేజ్ వచ్చి ఉండేది. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు ఘోరంగా ఫెయిల్ అవ్వగా.. షర్మిల సరిగ్గా దీనిని అంది పుచ్చుకుని ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా యువత దృష్టి తన వైపునకు తిప్పుకున్నారని తెలంగాణ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్కడితో ఆగని షర్మిల నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనల సాధన కోసం నిరాహారదీక్ష చేస్తానంటూ ఖమ్మం సభ వేదికగా ప్రకటించారు. ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో నిరాహారదీక్షలో కూర్చోనున్నారు. ఇక తమ పార్టీ కార్యకర్తలు కూడా తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు దీక్షలు చేయడంతో పాటు పోరాటాలు చేస్తారని ఆమె ప్రకటించారు. తెలంగాణ యువత నుంచి షర్మిలకు ఇప్పటి వరకు పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ ఆమె యువతను టార్గెట్ చేసుకోవడంతో పాటు వారిని తన వైపునకు మళ్లించేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే అంటున్నారు. మరి షర్మిల తొలి స్టెప్ తెలివిగా వేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినా.. ఆమె తరువాత అడుగులు ఎలా ఉంటాయన్నది మాత్రం ఆసక్తికరమే ?