వివేకానందరెడ్డి హత్య.. తదనంతర పరిణామాలు.. మరోసారి వైసీపీని తర్జన భర్జనలో పడేస్తున్నాయి. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రతిపక్షాలు హైలెట్ చేయడం.. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ నుంచి కూడా ఇదే విషయంపై రాజకీయ దాడి జరగడం వంటివి వైసీపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. వాస్తవానికి హత్య జరిగి రెండేళ్లు గడిచింది. ఈ రెండేళ్లలోనూ ఓ నాలుగు నెలలు తీసేసినా.. వైఎస్ కుటుంబమే రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో.. ఇప్పుడు టీడీపీని దోషిగా చూపించే అవకాశం ఎంతమాత్రం లేదు. ఈ క్రమంలో.. ఎదురు దాడి చేసేందుకు కూడా ఇతర నేతలకు ఛాన్స్ లేదు.
వివేకా హత్య పూర్తిగా వైఎస్ కుటుంబానికి సంబంధించిన విషయం కావడంతో ప్రతిపక్ష నేతల నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం వైసీపీలోని ఇతర నేతలకు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి, సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి.. వ్యూహాత్మకంగా ముందుకు వచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే క్రమంలో ఆయన విజయమ్మ పేరిట లేఖ సంధించారని.. పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వాస్తవానికి విజయమ్మ ఈ రెండేళ్లలో ఏనాడూ.. ప్రజల ముందుకు రాలేదు. రాష్ట్రంలో ఎస్సీ వర్గాలపై దాడులు జరుగుతున్నప్పటికీ.. హైకోర్టు నుంచి భారీ ఎత్తున ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ.. విజయమ్మ స్పందించలేదు.
కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఆమె తెరమీదకి వచ్చి.. వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని.. వైఎస్ కుటుంబ సభ్యులుగా మేం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నామని.. ఆమె సుదీర్ఘంగా ఐదు పేజీల లేఖ రాశారు. అయితే.. నిజానికి ఇప్పుడు ఆమె తెరమీదకి వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ.. ఇదంతా.. సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగిందనే ప్రచారం తెరమీదికి వచ్చింది.
లేఖ మొత్తం సజ్జల కనుసన్నల్లోనే రెడీ అయిందని.. కేవలం ఆమె పేరును మాత్రమే జోడించారని.. అంటున్నారు. మహిళ అనే సెంటిమెంటు వర్కవుట్ అవుతుందని భావించారని అందుకే ఆమెను అనూహ్యంగా తెరమీదికి తెచ్చారని.. తెలుస్తోంది. మున్ముందు.. దీనిని రాజకీయంగా వాడుకోకుండా చూసేందుకు ఇలా చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్.. వైసీపీలో హల్‌చల్ చేస్తుండడం గమనార్హం.