తిరుపతిలో ఏం జరుగుతుంది ? వైసీపీ అధినేత, సీఎం జగన్ భావిస్తున్నట్టు భారీ మెజారిటీ.. అంటే 3-4 లక్షల ఓట్ల ఆధిక్యం ఉంటుందా ? ఆ దిశగా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయా? ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి భారీ ఎత్తున అభ్యర్థులు పోటీ చేస్తుండడం. మరోవైపు.. బీజేపీ తరఫున కేంద్రంలోని పెద్దలు ఇక్కడకు వస్తుండడమే..! పార్టీ జాతీయ నాయకులు సైతం తిరుపతి ఉప ఎన్నికపై ఎంతో ఫోకస్ పెట్టడంతో పాటు ఇక్కడే మకాం వేశారు. బీజేపీ అభ్యర్థి ప్రచారం కోసం జాతీయ స్థాయిలో ఉన్న ఆర్ఎస్ఎస్ దళాలు ఇక్కడ పెద్దఎత్తున వాలిపోయాయి.
బీజేపీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్లు.. ఈ విషయంపై రెండు రోజులుగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీని తక్కువగా అంచనా వేశారు. స్థానిక ఎన్నికల్లో ఒక్క చోట కూడా సత్తా చూపించలేదు కనుక బీజేపీని ఇక్కడ కూడా ప్రజలు తిరస్కరిస్తారని అనుకున్నారు. ఇక, టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందని భావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 28 మంది అభ్యర్తులు పోటీలో ఉన్నారు. పైగా ఎవరి వర్గం వారికి ఉంది. ఈ నేపథ్యంలో ఓట్ల చీలిక ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
మరోవైపు టీడీపీ నేత, అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా ప్రచారం ముమ్మరం చేశారు. స్థానిక ఎన్నికలు బహిష్కరించడంతో టీడీపీ ప్రధాన నాయకులు, పెద్ద తలకాయలు తిరుపతి పార్లమెంటు పరిధిలో మకాం వేసి కులాల వారీగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక యువనేత లోకేష్ కూడా పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో కొన్ని వర్గాల్లో కొంత ఓటు బ్యాంకు మారుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. అదే సమయంలో ఇప్పుడు బీజేపీ జాతీయ నేతలు.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డానే కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ దాస్, అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడ ప్రచారానికి రానున్నారని తెలిసింది. వీరిలో యోగికి మంచి వాక్చాతుర్యంతోపాటు తిరుమల వివాదాస్పద అంశాలపై మాట్లాడే పట్టు ఉంది.
ఈ నేపథ్యంలోనే జగన్‌పై ఉన్న కేసులు, రాష్ట్ర అభివృద్ధి, నిధుల వినియోగం.. వంటివాటిని ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రచారానికి తీసుకువెళ్తారని అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపీ ఆశిస్తున్న విధంగా ముఖ్యంగా సీఎం జగన్ పెట్టుకున్న భారీ మెజారిటీ ఆశలు నెరవేరడం కష్టమేనని వైసీపీ సీనియర్లు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. గెలుపు గుర్రం ఎక్కడం ఓకే అయినా.. ఆది నుంచి దేశం మొత్తం తిరుపతి రిజల్ట్, మెజారిటీ వైపు చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో ఇప్పటికే ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఇక్కడే పాగా వేసి ప్రచారం చేస్తున్నారు. అయితే.. మారుతున్న పరిణామాలు వీరి అంచనాలను తారు మారు చేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.