ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 17న జరుగుతోంది. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో ఇప్పుడు తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఇక్కడ ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ పోటీ చేస్తున్నాయి. జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. ఇక ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తోన్న మూడు పార్టీల అభ్యర్థుల ప్లస్‌లు, మైనస్‌లు పరిశీలిస్తే ఆసక్తికర విషయాలే కనిపిస్తాయి. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి జగన్ ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ రత్నప్రభ బరిలో ఉన్నారు.
వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచిన దుర్గాప్రసాద్ పోలైన ఓట్లలో ఏడు లక్షలకు పైచిలుకు ఓట్లు అంటే 55 % ఓట్లు సాధించారు. ఆయనకు 2.28 లక్షల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. ఇక రెండో స్థానంలో ఉన్న్ మాజీ మంత్రి పనబాక లక్ష్మి 37 శాతం ఓట్లు సాధించారు. అందుకే చంద్రబాబు రెండోసారి కూడా ఆమెకే సీటు ఇచ్చారు. పైగా పార్లమెంటు కేంద్రం అయిన తిరుపతిలో పనబాకకే స్వల్ప మెజార్టీ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం వైసీపీ స్వింగ్‌లో ఉండడం కూడా ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి చాలా ప్లస్. పార్లమెంటు పరిధిలో నాలుగుచోట్ల రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు.
గురుమూర్తికి అధికార పార్టీ సానుకూలత ఉన్నా.. జగన్ ఫిజియో థెరపిస్ట్ కావడం.. మరే ఇతర రాజకీయ అనుభవం లేకపోవడం మైనస్. ఇక పార్లమెంటు పరిధిలో వైసీపీ నేతల్లో ఉన్న గ్రూపు తగాదాలు కూడా ఆయనకు మైనస్. ఇక జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ ఉన్నత విద్యావంతురాలు, మాజీ ఐఎస్ అధికారి కావడం ప్లస్. పైగా బీజేపీ దుబ్బాక వల్లే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. జనసేన సపోర్ట్, పవన్ ప్రచారం ఆమెకు కలిసి రానున్నాయి. పైగా ఆమె ఒక్కరే మాదిగ వర్గం నేత కావడం కూడా ఆమెకు కాస్త ప్లస్ పాయింటే. ఆమె ఐఏఎస్ అయినా రాజకీయాలకు కొత్త కావడం.. అటు వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం.. జనసేనలో కేడర్ ఆమెకు ఓట్లేయకూడదని నిర్ణయించుకోవడం, ఏపీ ప్రజల్లో బీజేపీపై పీకల్లోతు ఉన్న వ్యతిరేకత ఆమెకు చాలా మైనస్.
ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరు జిల్లాకే చెందిన వారు. ఆమె పలుమార్లు ఎంపీగా గెలవడంతో పాటు రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. గతంలో ఈ ప్రాంతానికి ప్రాధినిత్యం వహించి ఉన్నారు. ఇక ఏపీలో టీడీపీపై నమ్మకం లేకపోవడం,, ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం, పనబాక అవుట్ డేటెడ్ అయిపోవడం.. ఈ ఎన్నికను పూర్తిగా అచ్చెన్నాయుడు మీద వదిలి వేయడం.. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం… పార్టీ నేతలు కూడా ప్రచారానికి దూరంగా ఉండడం టీడీపీకి మైనస్ కానున్నాయి.