కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల పరిస్థితి ముందు గొయ్యి.. వెనుక నుయ్యి.. అన్నచందంగా మారిపోయింది. పార్టీని బలోపేతం చేయాలా? చేస్తే.. మనకేంటి లాభం? చేయకుండా ఉందామా?.. ఇలా ఉంటే.. మనకు వచ్చేది కన్నా.. పోయేదే ఎక్కువ? అని తర్జన భర్జన పడుతున్నారు. దీనికి కారణం.. ఇక్కడ ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కేఎస్ జవహరే ఉండడం. కానీ, ఈయన మనసు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుపై ఉండగా.. మనిషిగా మాత్రం తిరువూరుకే పరిమితమయ్యారు. చంద్రబాబు సైతం ఆయన అభ్యర్థనను ఇప్పట్లో పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఆది నుంచి తిరువూరులో పార్టీని బలోపేతం చేసిన.. నల్లగట్ల స్వామిదాసుకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. టెక్నికల్‌గా చూస్తే.. ఇక్కడ పార్టీ ఇంచార్జ్ జవహరే. కానీ, ఆయన నియోజకవర్గంలో ఉండడం లేదు. ఉంటే విజయవాడ లేదంటే రాజమండ్రి. అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆయన ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటు పార్టీ.. టీడీపీ ఇంచార్జ్‌గా ఉండడంతో ఎక్కువ సమయం అక్కడే ఉంటూ.. కొవ్వూరు రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తిరువూరులో పార్టీని పట్టించుకునే వారు కరువయ్యారు.
జవహర్ టెక్నికల్‌గా తిరువూరు ఇంచార్జ్ కావడంతో.. తాను ఏం చేసినా.. ప్రయోజనం ఏంటనే ధోరణిలో మాజీ ఎమ్మెల్యే స్వామి దాసు ఉన్నారు. ఇప్పుడు పూసుకుని రాసుకుని పార్టీని డెవలప్ చేసినా.. చివరి నిముషంలో తనకు టికెట్ ఇస్తారా? లేదా? అనే సందేహం ఆయనలో కనిపిస్తోంది. గత 2019 ఎన్నికల సమయంలోనూ ఇలానే ఎన్నికలకు ముందు తనను పక్కన పెట్టారని.. దీంతో అప్పటి వరకు చేసిన కష్టం వృధా అయిందని ఆయన ఆవేదనగా ఉన్నారు.
ఇప్పుడు కూడా తనకు చంద్రబాబు నుంచి ఎలాంటి క్లారిటీ లేనందున ఏం చేసినా.. ప్రయోజనం ఉంటుందా? అనే సందేహం ఉంది. అయితే.. అలాగని ఇప్పటి నుంచి పార్టీని పట్టించుకోకపోతే.. ఎన్నికల సమయానికి టికెట్ తనకే ఇస్తే.. అప్పుడు మొత్తానికే మోసం వస్తుంది కదా? అని ఆలోచిస్తున్నారు. ఇక జవహర్ తిరువూరు ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయన మనసంతా మాత్రం ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మీదే ఉంది. మొత్తంగా చూస్తే.. తిరువూరు తమ్ముళ్లకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates