అనుకోని విషాదం ఎదురైంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే 62 ఏళ్ల డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్ లో చికిత్స తీసుకొని కడపకు చేరుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. అయితే.. మరోసారి అనారోగ్యానికి గురైన ఆయన కొద్దిరోజులుగా కడపలోని అరుణాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో.. నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య.. కొడుకు.. కుమారుడు ఉన్నారు. ఎమ్మెల్యే సతీమణి కూడా వైద్యురాలే. ఆయన కుమార్తె ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతుంటే.. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. ఎమ్మెల్యే మరణంపై వైసీపీ నేతలు.. కార్యకర్తలు సంతాపాన్ని వ్యక్తంచేస్తున్నారు.
వెంకట సుబ్బయ్య స్వస్థలం బద్వేలు పురపాలక పరిధిలోని మల్లెలవారి పల్లి. కుగ్రామంలో పుట్టినా స్వశక్తితో చదువుకొని పైకి వచ్చారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన ఆయన.. కామినేని.. అపోలో ఆసుపత్రుల్లో వైద్యుడిగా సేవలు అందించారు. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం బద్వేలుకు తీసుకెళ్లనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates