ఏపీలో ఇసుక తుఫాన్ రాబోతుందా ?

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది ఇసుక పంపిణీ గురించే..! తాజాగా ఏపీలో ఇసుక మొత్తం ఒకే కంపెనీకి క‌ట్ట‌బెట్ట‌డంపై విప‌క్షాల్లోనే కాకుండా.. అటు అధికార పార్టీ నేత‌ల్లోనూ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల‌కు దీని వ‌ల్ల త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా తాము ఇసుక తీసుకునేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో వారంతా ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై మండి ప‌డుతున్నారు. ఇక విప‌క్షాలు అయితే ఇసుక‌ను కూడా క్విడ్ ప్రో కిందే జ‌గ‌న్ బినామీ కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టేశార‌ని తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి.

ఇసుక తవ్వ‌కాల్లో ఏ మాత్రం అనుభ‌వం లేకుండా.. వేల కోట్ల న‌ష్టాల్లో ఉన్న కంపెనీకి రాష్ట్రం అంత‌టా ఇసుక తవ్వే అనుమ‌తులు ఎలా ఇచ్చారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తోన్న అధికార పార్టీ మంత్రులు, కీల‌క నేత‌ల నుంచి మాత్రం అదే రేంజ్‌లో కౌంట‌ర్లు రావ‌డం లేదు. ఎందుకంటే ఈ విధానం వారికే న‌చ్చ‌డం లేద‌ని ఆ పార్టీ నేత‌లే గ‌గ్గోలు పెడుతున్నారు. మ‌రోవైపు ప్ర‌జాధ‌నంతో మాత్రం ప్ర‌భుత్వం పేప‌ర్ల‌లో కౌంట‌ర్లు ఇప్పిస్తోంది. ప్ర‌తిప‌క్షాల నుంచి ఇంత తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఉన్నాయి.. మ‌రో వైపు ప్ర‌జ‌ల్లోనూ ఇసుక విధానంపై తీవ్ర విమ‌ర్శ‌లు ఉంటే.. మంత్రులో లేదా ముఖ్య‌మంత్రో ఆన్స‌ర్ చేయ‌కుండా… పేప‌ర్ ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌మః అనిపించేయ‌డం సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా న‌చ్చ‌డం లేదు.

విచిత్రం ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్‌లైన్ ఇసుక పంపిణీ విధానం అద్భుతం అని.. ప్ర‌జ‌ల ఇంటి వ‌ద్ద‌కే నేరుగా ఇసుక పంపిణీ చేస్తున్నామంటూ ప్ర‌భుత్వం గొప్ప‌లు పోయింది. తాము ఎంతో మంచి ప‌ని చేస్తున్నా.. ప్ర‌తిప‌క్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయంటూ ప్ర‌భుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పుడు అదే ప్ర‌భుత్వం తాము గొప్ప‌గా చెప్పుకున్న పాల‌సీనే తీసిప‌డేసింది. అయితే ఈ ఆన్‌లైన్ ఇసుక విధానంలో జ‌రిగిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు ప‌రం చేసేసింది. ఇప్పుడు వీళ్లు జ‌నాల ద‌గ్గ‌ర ఏ స్థాయిలో దోపిడీ చేస్తారో ? అన్న సందేహాలు ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉన్నాయి.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉచిత ఇసుక విధానంకు మంచి మార్కులు ప‌డ్డాయి. కేవ‌లం ర‌వాణా ఖ‌ర్చులు మాత్ర‌మే వినియోగ‌దారులు భ‌రించేవారు. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక మాత్రం ఇసుక బంగారం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మ‌ధ్య‌త‌ర‌గ‌తోళ్లు ఇళ్లు క‌ట్టాలంటే భ‌వ‌న‌ నిర్మాణ వ్య‌యంలో 20 శాతం ఇసుక‌కే పెట్టాల్సిన ప‌రిస్థితి ఉంది. ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న ఇసుక అంశంలో లోపాలు స‌రిదిద్దుకోవాల్సింది పోయి… ప్ర‌జ‌ల్లో మ‌రింత అసంతృప్తి క‌లిగేలా ఇసుక అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కంపెనీకి క‌ట్ట‌బెట్ట‌డం చూస్తుంటే ఇది మ‌రింత దోపిడీకి ఆస్కారం ఇచ్చినట్టే అన్న విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి. ఇది త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వంపై పెను దుమారానికి కార‌ణం కానుంద‌ని కూడా అంటున్నారు.