తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావటం సందిగ్దంలో పడిందా ? మొన్నటి వరకు వెల్లడైన సర్వే నివేదికలన్నీ డీఎంకేనే అధికారంలోకి వచ్చేస్తోందని చెప్పిన విషయం తెలిసిందే. మరలాంటపుడు డీఎంకే చీఫ్ స్టాలిన్ సెంటిమెంటు అస్త్రాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు ? అన్నీడీఎంకే చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరును పదే పదే ఎందుకు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ? అన్నదే ఇపుడు అర్ధం కావటంలేదు.
రాజకీయాల్లో డీఎంకే-అన్నీడీఎంకేలు బద్ధ విరోధులన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది స్టాలన్ తన ప్రచారంలో జయలలిత పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. విషయం ఏమిటంటే జయ మరణాన్ని తనకు అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. దాదాపు నెలన్నర రోజులు ఆసుపత్రిలో ఉన్న జయలలిత మరణించిన విషయం తెలిసిందే. అయితే జయ మరణంపై అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా అనేక మందిలో చాలా అనుమానాలున్నాయి.
అంటే జయ మరణం అనుమానాస్పదమనే చెప్పాలి. దీనిపై హైకోర్టులో పెద్ద విచారణ కూడా జరిగింది. ఇప్పుడు ఇదే అంశాన్ని స్టాలిన్ వ్యూహాత్మకంగా ప్రస్తావిస్తున్నారు. డీఎంకే అధికారంలోకి రాగానే జయ మరణంపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుండి మరణించారని డాక్టర్లు ప్రకటించేంత వరకు ఏమి జరిగిందనే విషయాలపై సమగ్రంగా విచారణ జరిపిస్తామంటు స్టాలిన్ పదే పదే చెబుతున్నారు.
తన ఎన్నికల ప్రచారంలో జయ మరణాన్ని, విచారణను, అనుమానాలను వాడుకుంటున్నారంటేనే జనాల్లో సెంటిమెంటును రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైపోతోంది. జయ మీదున్న అభిమానాన్ని, ఆదరణను తనకు అనుకూలంగా మలచుకునేందుకు డీఎంకే చీఫ్ చేయని ప్రయత్నాలు లేవు. ఒకవైపు జనాలకు అన్నీ ఉచితంగా ఇస్తానని చెబుతునే, మరోవైపు హిందుత్వ రాజకీయాలు కూడా మొదలుపెట్టేసిన స్టాలిన్ తాజాగా జయ మరణాన్ని కూడా వాడేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates