అందరిలోను టెన్షన్ మొదలైందా ?

అవును అలాగనే అనుకోవాలి. నిజానికి ఈ ప్రక్రియతో రాష్ట్రానికి ఇంకా చెప్పాలంటే ఏ రాష్ట్రానికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ప్రతిది సంచలనమే అవుతోంది. అందుకనే తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ? అనే విషయంలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే సీజేఐ నియామకానికి అధికారిక ప్రక్రియ మొదలైంది కాబట్టే.

తదుపరి సీజేఐని సూచించమని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నుండి ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి అధికారికంగా లేఖ అందింది. బాబ్డే వచ్చేనెల 23వ తేదీ సీజేఐగా రిటైర్ అవుతున్నారు. ఆయన తరపున చీఫ్ జస్టిస్ గా ఎవరుండాలనే విషయాన్ని సూచించమని కేంద్రమంత్రి అడిగారు. నిజానికి ఎవరికీ అవసరం లేని ఈ విషయంలో రాష్ట్రంలో మాత్రం అందరిలోను టెన్షన్ మొదలైందనే చెప్పాలి. కారణం ఏమిటంటే బాబ్డే తర్వాత చీఫ్ జస్టిస్ గా సీనియర్ మోస్టు జస్టిస్ అయిన ఎన్వీ రమణ అవుతారు.

అయితే రమణ పై జగన్మోహన్ రెడ్డి స్వయంగా చాలా ఫిర్యాదులు చేశారు. రమణ మద్దతుతోనే చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని అనవసరంగా బద్నాం చేస్తున్నారనేది జగన్ అభియోగాలు. అప్పటి హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి+ మరో 6గురు జస్టిస్ లను రమణ ప్రభావితం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్ధానాల్లో చికాకులు పెడుతున్నారని జగన్ ఆరోపణలు అప్పట్లో దేశంలో సంచలనమయ్యాయి.

కేవలం ఆరోపణలు మాత్రమే చేయటం కాకుండా అందుకు తగిన ఆధారాలను కూడా జగన్ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగానే జేకే మహేశ్వరి ఆకస్మిక బదిలీ జరిగిందని ప్రచారం అందరికీ తెలిసిందే. రమణ గనుక చీఫ్ జస్టిస్ అయితే ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయవ్యవస్ధ మితిమీరిన జోక్యం జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును కాపాడుతున్నది కూడా రమణే అన్నది జగన్ అనుమానాలు.

అందుకనే రమణపై నేరుగా బాబ్డేకే ఫిర్యాదులు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తిచేశారు. జగన్ ఆరోపణలు, ఆధారాలపై బాబ్డే విచారణ జరుపుతున్నారు. ఒకవేళ జగన్ ఆరోపణల్లో వాస్తవం ఉందని బాబ్డే అనుకుంటే ఏమవుతుంది ? జగన్ ఆరోపణలు నిరాధారమని తేలితే అపుడేమవుతుంది ? అన్నది సస్పెన్సుగా మారింది. దాంతో అందరి దృష్టి రమణ మీద బాబ్డే జరుపుతున్న విచారణపైనే ఉంది. ఈ నేపధ్యంలోనే తదుపరి చీఫ్ జస్టిస్ నియామకానికి అధికార ప్రక్రియ మొదలైంది. మరి బాబ్డే తన విచారణలో ఏమి తేలుస్తారో ? ఏమని రిపోర్టిస్తారో అర్ధంకాక అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.