పార్టీ నేతలే కొంప ముంచేశారా ?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత టీడీపీలో వినిపిస్తున్న విశ్లేషణను బట్టి ఇలాగే అనుకోవాలి. పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఓ అధ్యక్షుడిని నియమించారు. అయితే వాళ్ళలో చాలామంది క్షేత్రస్ధాయిలోకి వెళ్ళి పనిచేయలేదట. పార్టీ నేతలను సమన్వయం చేసుకోవటంలో చాలామంది ఫెయిలైనట్లు సమాచారం.

కరోనా వైరస్ పుణ్యామని మున్సిపల్ ఎన్నికలకు దాదాపు ఏడాది గడువొచ్చింది. ఇందులో ఓ ఆరుమాసాలను తీసేసినా మిగిలిన ఆరుమాసాల్లో పార్టీ సీనియర్లలో అత్యదికులు పార్టీని పట్టించుకోలేదనే వాదన బయటకు వస్తోంది. చివరకు పాలిట్ బ్యూరో సభ్యుల్లో చాలామంది పార్టీని తమ జిల్లాల్లో గాలికొదిలేశారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కొందరు ఇన్చార్జిలు మాత్రమే శక్తివంచన లేకుండా కష్టపడినా ఉపయోగం లేకుండాపోయింది.

పాలిట్ బ్యూరోలో కానీ లేదా రాష్ట్ర, జాతీయ స్ధాయి కమిటిల్లోని నేతల్లో చాలామందికి క్షేత్రస్ధాయిలో బలమే లేదు. 24 గంటలూ మీడియా సమావేశాల్లోనో లేకపోతే టీవీ డిబేట్లలోనో కాలం గడిపేస్తుంటారని పార్టీ వర్గాలు ఇపుడు మండిపోతున్నాయి. పార్టీ బలోపేతానికి కష్టపడేవారిని, పైపైన కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే వారిని చంద్రబాబు ఒకేలా ట్రీట్ చేస్తుండటమే విచిత్రంగా ఉందంటున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన వారు, పదవులు అందుకున్న వారు, ఆర్ధికంగా బలోపేతమైన నేతల్లో గడచిన రెండేళ్ళుగా ఎంతమంది క్రియాశీలంగా ఉన్నారో లెక్కలు తీయమని పార్టీ క్యాడర్ నిలదీస్తున్నారు. పై క్యాటగిరిల్లోని వాళ్ళల్లో అత్యధికులు కేవలం షో మాత్రమే చేస్తున్నారని, చాలామంది అసలు పార్టీలో కనబడటం లేదని మండిపోతున్నారు. సంస్ధాగతంగా పార్టీని బలోపేతం చేయటంలో చంద్రబాబు దృష్టి పెట్టనపుడు ఇక నేతలు మాత్రం ఎందుకు కష్టపడతారనే వాదన కూడా వినబడుతోంది.

తెలుగుయువత, తెలుగు రైతు లాంటి అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించిన చంద్రబాబు కమిటిలను మాత్రం వేయలేదు. కమిటిల నియామకాల విషయంలో ఎన్నిసార్లు ప్రస్తావించినా చంద్రబాబు దృష్టి పెట్టలేదు. దాంతో అధ్యక్షులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి అనేక లోపాల కారణంగానే పార్టీ పుట్టి ముణిగిపోయిందని నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ముణిగిపోయింది లేదని రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని నేతలు అడుగుతున్నారు. మరి చంద్రబాబు ఏమి చేస్తారో చూడాల్సిందే.