మరో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో హైదరాబాద్ లోని బాబు నివాసానికి అధికారులు చేరుకున్నారు. వాహనాల్లో వెళ్లిన వారు.. చంద్రబాబును కలవాలని చెప్పారు. అందుకు బాబు భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లుగా బాబుకు సమాచారం ఇవ్వటం.. ఆయన లోపలకు పంపాలని చెప్పటంతో సదరు అధికారుల్ని లోపలకు అనుమతించారు.
రాజధాని భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ అధికారులు వచ్చినట్లుగా చెబుతున్నారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. నోటీసులు అందించిన తర్వాత విచారణకు పిలుస్తామని అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏపీ విపక్ష తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైన వేళ.. పార్టీ వర్గాలన్ని నిరాశలో కూరుకుపోయిన సమయంలోనే బాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కేలా చేశాయని చెబుతున్నారు.