ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలన్ని ఒక ఎత్తు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన ఎన్నిక ఒక ఎత్తుగా చెప్పాలి. ఎందుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయ గుర్తింపు ఉన్న జేసీ కుటుంబానికి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నిక.. వారు కోరుకున్నట్లే సానుకూల ఫలితం వచ్చినా.. అధిక్యత త్రుటితో తప్పింది. దీంతో.. ఎవరైతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారో వారే తాడిపత్రి మున్సిపాల్టీని సొంతం చేసుకునే వీలుంది. దీంతో.. స్పందించిన జేసీ సోదరులు ఆదివారం అర్థరాత్రి.. తమ వర్గానికి చెందిన కౌన్సిలర్లను తీసుకొని హైదరాబాద్ కు వచ్చినట్లుగా చెబుతున్నారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉంటే.. టీడీపీ 18 వార్డుల్లో.. వైసీపీ 16 వార్డుల్లో విజయం సాధించింది. సీపీఐ ఒకటి.. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. దీంతో.. తమ పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లను రహస్య ప్రదేశానికి తరలించారు. అధికార వైసీపీ వారు తమ పార్టీ వారిని ప్రలోభాలకు గురి చేస్తారన్న ఆలోచనతో ఎవరికి తెలియని ప్రదేశానికి జేసీ సోదరులు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.
తమ కౌన్సిలర్లను వైసీపీ నేతలు బెదిరించి… భయపెడతారన్న అనుమానంతోనే ఇలా చేసినట్లుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాడిపత్రి రాజకీయం హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. కౌన్సిలర్లను తీసుకొని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. జేసీ పవన్ రెడ్డిలు హైదరాబాద్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తాడిపత్రి రాజకీయం రానున్న రోజుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతుందని చెప్పక తప్పదు.