మంత్రి పదవుల రేసులో వైసీపీ నేతలు నువ్వా-నేనా అనే రీతిలో ముందున్నారు. ఒకరిని మించి ఒకరు.. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలో జగన్ తన ప్రభుత్వంలోని మంత్రులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చేందుకు ఆయన సిద్ధమైన విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగు తోంది. దీంతో ఇప్పుడున్న వారు జాగ్రత్తలు పడుతుంటే.. కొత్తవారు పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. వీరిలో విశాఖ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కీలకంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
వీరిలో ఒకరు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,, మరొకరు.. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఇద్దరూ కూడా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. వీరి వ్యవహారం ఇప్పుడు విశాఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న మంత్రి అవంతి శ్రీనివాస్‌ను పక్కన పెట్టడంతోపాటు.. ఈ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని వైసీపీ వర్గాలు చెబు తున్నాయి. దీంతో కరణం, గుడివాడలు ఇద్దరూ కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కరణం విషయానికి వస్తే.. వైఎస్ హయాం నుంచి కూడా ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహిత నాయకుడిగా కరణం గుర్తింపు పొందారు. వైఎస్ పాదయాత్ర సమయంలో పాటలు రాసి ప్రత్యేక గుర్తింపు పొందారు. చిన్నపాటి నాటక ప్రదర్శనలు ఇచ్చి.. వైఎస్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు.
వైఎస్ అనంతరం.. జగన్‌కు మద్దతుగా వ్యవహరించారు. ఆయన పార్టీలోనూ చేరి.. వైసీపీ బలోపేతానికి కృషి చేశారు. మొత్తంగా చూస్తే.. జగన్‌కు చేరువైన నాయకుడిగా.. ప్రధానంగా వైఎస్ కుటుంబంతో అనుబంధం పెంచుకున్న నేతగా కరణం గుర్తింపు పొందారు. దీంతో ఈయన పేరు పరిశీలనకు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, యువ నేత.. గుడివాడ అమర్నాథ్ కూడా వారసత్వంగా రాజకీయాలు అందిపుచ్చుకున్నారు. జగన్‌కు సన్నిహితుడిగా, మిత్రుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఈయన కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువ నేత కావడంతో తనకు కాపుల కోటాలో ఖచ్చితంగా అవకాశం చిక్కుతుందని భావిస్తున్నారు. అయితే.. అంతర్గత పోరు ఈయనకు సెగ పెడుతోంది. పార్టీలో వ్యతిరేకత పెరుగుతుండడం స్థానిక నేతలే ఈయనకు ప్రాధాన్యం ఇవ్వవద్దని జగన్‌కు ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరణం వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.