మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అత్యంత కీలకమైన రెండు అంశాల్లో జగన్ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండం అధికార పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో సహకారం అందిస్తున్నప్పటికీ అటు నుంచి మాత్రం ఏమాత్రం సహకారం లేకపోగా.. జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా సమాచారాన్ని బయటపెడుతుండటం గమనార్హం.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారంలో జగన్ సర్కారు దోషిగా నిలబడాల్సిన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పార్లమెంటు సాక్షిగా ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ వెల్లడించిన ఓ విషయం ఏపీ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. స్టీల్ ప్లాంటులో ప్రభుత్వం వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోబోతోందని, పరిశ్రమ ప్రైవేటు పరం కాబోతోందని స్పష్టం చేయడమే కాక.. ఈ విషయమై ముందు నుంచి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, సమయానుకూలంగా వారి సహకారం కూడా కోరామని రాతపూర్వకంగా మంత్రి జవాబునివ్వడంతో.. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంతా జగన్ సర్కారుకు తెలిసే జరుగుతోందని, పరోక్షంగా ఇందుకు సహకరిస్తోందన్న భావం జనాల్లోకి వెళ్తోంది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ముంగిట ఇది ప్రభుత్వానికి చేటు చేసే విషయమే.
మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించే విషయంలోనూ జగన్ సర్కారు వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం బయటపెట్టేసింది. ఇది కూడా పార్లమెంట్ సాక్షిగానే జరగడం గమనార్హం. వైసీపీకే చెందిన ఓ ఎంపీ పోలవరం నిధుల గురించి ప్రస్తావిస్తే.. ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పోలవరం నిధుల కోసం ఎలాంటి విజ్ఞప్తీ చేయలేదని, అందుకోసం ఎలాంటి వినతి పత్రం ఇవ్వలేదని సమాధానం వచ్చింది. ఐతే ఇటీవల అమిత్ షాను కలిసిన అనంతరం ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రెస్ నోట్లో ముఖ్యమంత్రి.. పోలవరం నిధుల కోసమే హోం మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. కానీ అది అబద్ధమని పార్లమెంట్ సాక్షిగా తేలింది. తమ నుంచి ఎంతో మద్దతు పొందుతూ ఉండి కూడా.. కేంద్రం ఇలా తమను అడ్డంగా బుక్ చేస్తుంటే జగన్ అండ్ కో ఏమని స్పందించాలి?
Gulte Telugu Telugu Political and Movie News Updates