వైసీపీలో బెజవాడ మేయర్ పీఠం ఎవరికి ఇస్తారు? ఎవరికి ఈ పీఠం దక్కుతుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్నా.. మేయర్ పీఠంపై వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారు. ప్రధానంగా గెలుస్తామా? లేదా? అనే సందేహంతో ఉన్నారా? లేక.. ఎవరికి వారు పోటీలో ఉన్నందున.. ఎవరికి అవకాశం ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే.. ఏం కొంపలు మునుగుతాయోనని భయపడుతున్నారా? అనేది ప్రశ్నగా మారింది.
ఈ దఫా మునిసిపల్ ఎన్నికల్లో గతంలో ఊహించని విదంగా పోటీ జరుగుతోంది. అధికార పక్షం నుంచి మంత్రులు రంగంలోకి దిగారు. ఇక, ప్రతిపక్షం టీడీపీ నుంచి ఏకంగా పార్టీఅధినేత చంద్రబాబు కూడా రోడ్ షో కోసం దిగారు. ఇక, అధికార పక్షం నేతల మాటల తూటాలు పేలకపోయినా.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రత్యేకంగా తీసుకుని చేస్తున్న ప్రచారం .. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీలో ఊపు తెచ్చాయి. శివారు ప్రాంతం వరకు కూడా మొత్తం 64 డివిజన్లలోనూ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
అదేసమయంలో మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను ప్రకటించారు. ఈమె కూడా ప్రతి వార్డులోనూ రోడ్ షో చేస్తున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ మాత్రం ఎవరికీ మేయర్ పీఠం ఇస్తామని.. బహిరంగంగా ప్రకటించలేదు. అయితే.. మాజీ కార్పొరేటర్, ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పూనూరు గౌతం రెడ్డి కుమార్తె ప్రస్తుతం రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, అదేసమయంలో జనరల్ మహిళను మరొకరిని రంగంలోకి తెచ్చేందుకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే.. ఏదైనా కూడా విజయం సాధించిన తర్వాతే ప్రకటిస్తామని పార్టీ అధిష్టానం చెబుతుండడం గమనార్హం. కానీ, విశాఖ, గుంటూరు కార్పొరేషన్లలో మాత్రం ముందుగానే మేయర్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ విజయవాడ విషయానికి వచ్చే సరికి మాత్రం ప్రకటించకపోవడం గెలుపుపై సందేహంతోనేనా? అనే సందేహాలు వ్యక్తవుతుండడం గమనార్హం. మరి గెలుస్తారా? లేదా? చూడాలి.