చంద్రబాబును ఎంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ?

విజయవాడ తెలుగుదేశంపార్టీలో పరిస్ధితి చాలా విచిత్రంగా ఉంది. పార్టీ నేతలే ఒకళ్ళపై మరొకళ్ళు ఆధిపత్యం కోసం గొడవలు పెరిగిపోతున్నాయి. విజయవాడ నగరం పార్టీ నిలువుగా చీలిపోయిందనే అర్ధమవుతోంది. ఎంపి కేశినేని నాని ఒకవైపు మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ నాగూల్ మీరా అండ్ కో మధ్య పార్టీ చీలిపోయింది. వీళ్ళు కాకుండా ఇంకా సీనియర్ నేతలు పార్టీలో ఉన్నా వాళ్ళెవరు ఎక్కడా పిక్చర్లో కనబడటం లేదు.

గతంలో గొడవలు జరిగినపుడు కూడా పై నేతల మధ్యే జరిగింది కానీ విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ తదితరులు ఎక్కడా బహిరంగంగా కనబడలేదు. తాజాగా వీళ్ళ మధ్య గొడవలు రోడ్డున పడటానికి మేయర్ సీటే కారణమని అర్ధమవుతోంది. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా పై ముగ్గురు నేతలు ఒక అభ్యర్ధిని సూచించారు. ఎంపి మాత్రం తన కూతురు శ్వేతను ప్రకటించాలని కోరారు. దాదాపు ఏడాది క్రితం ఎన్నికలు వాయిదా పడేనాటికి శ్వేతే మేయర్ అభ్యర్ధి.

అయితే ఇపుడు మళ్ళీ మొదలైన ప్రక్రియలో మేయర్ అభ్యర్ధి స్ధానంలో శ్వేత ప్లేసులో మరొకరొచ్చారు. దాంతో నానికి మండిపోయింది. ఈ నేపధ్యంలోనే పై నేతల మధ్య కొన్ని రోజులుగా గొడవలు బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే శ్వేతను మేయర్ అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించటంతో అందరు ఆశ్చర్యపోయారు. తెరవెనుక ఏమి జరిగిందో ఎవరికీ అర్ధంకాలేదు. కాకపోతే ఏదో జరగటం వల్లే చంద్రబాబు ఎంపి కూతురును మేయర్ అభ్యర్దిగా ప్రకటించారనే ఆనుమానాలు పెరిగిపోయాయి.

ఈ అనుమానాలు ఇలాగుండగానే హఠాత్తుగా శనివారం మీడియా సమావేశంలో బుద్దా మాట్లాడుతూ చంద్రబాబును ఎంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. తమ అధినేతను ఎంపి బ్లాక్ మెయిల్ చేసి తన కూతురును మేయర్ అభ్యర్ధిగా ప్రకటింప చేసుకున్నారని ఆరోపించటం పార్టీలోనే కాకుండా బయటకూడా కలకలం రేపుతోంది. బుద్దా ఆరోపించినట్లుగా చంద్రబాబును ఎంపి బ్లాక్ మెయిల్ చేశారా ? లేదా అన్నదే ఇఫుడు తేలాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)