బాబు మంత్రం.. చ‌ల్లారిన బెజ‌వాడ టీడీపీ అల‌జ‌డి

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కొన్నాళ్లుగా స‌న్న‌గిల్లుతోంది. ఎంపీ కేశినేని నానికి, ఇత‌ర నాయ‌కుల‌కు మ‌ధ్య అగాధం పెరుగుతోంది. ఎంపీ వ్యాఖ్య‌లతో స్థానికంగా ఉన్న నేత‌లు.. పార్టీ జెండా మోస్తున్న వారు హ‌ర్ట్ అవుతున్న విష‌యం వాస్త‌వమే. అయితే.. ఇది అన్ని పార్టీల్లోనూ సాధార‌ణంగా ఉన్న‌దేన‌ని అంద‌రూ భావించారు. అయితే.. శనివారం ఒక్క‌సారిగా ఈ పొగ‌లు.. సెగ‌లు.. భారీ ఎత్తున చెల‌రేగాయి. కేశినేని నాని.. త‌న వ్యాఖ్య‌ల‌తో మ‌రింత అగ్గి రాజేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయినా.. తాను ఒక్క‌డినే గెలిచాన‌ని.. రోడ్లు బాగోక పోతే.. త‌ట్ట‌మ‌ట్టి చంద్ర‌బాబు పోశాడా? జ‌గ‌న్ పోశాడా? నేను పోశాను! అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, మ‌రో నేత నాగుల్ మీరాలు మీడియా ముందుకు వ‌చ్చి .. ఎంపీ వ్య‌వ‌హార శైలిని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ రువ్వారు. ఇక‌, బుద్దా వెంక‌న్న అయితే.. ఇలాంటి నేత‌ను చెప్పుతో కొడ‌తా! అంటూ .. ఘాటుగా వ్యాఖ్యనించారు. దీంతో ఒక్క‌సారిగా బెజ‌వాడ టీడీపీలో పెను తుఫాను తెర‌మీదికి వ‌చ్చింది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని టీడీపీ ఒక‌వైపు ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా.. నాయ‌కులు ఇలా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, స‌వాళ్లు రువ్వుకోవ‌డం.. స‌హ‌జంగానే తీవ్ర ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌ని.. అంద‌రూ అనుకున్నారు. అయితే.. ఈ నేప‌థ్యంలో వెనువెంట‌నే జోక్యం చేసుకున్న చంద్ర‌బాబు.. వెంట‌నే ఈ మంట‌ల‌పై నీళ్లు చ‌ల్లారు.

అధినేత చంద్ర‌బాబు జోక్యంతో వివాదం చల్లారింది. విశాఖ‌లో ఉన్న చంద్ర‌బాబు టెలికాన్ఫరెన్స్‌లో బెజ‌వాడ నేత‌ల‌తో మాట్లాడారు. అసంతృప్త నేతలను సముదాయించారు. అధినేత ఆదేశాలతో బెజవాడ నేతలతో అచ్చెన్నాయుడు, టి.డి. జనార్దన్‌, వర్ల రామయ్య చర్చించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఏదైనా స‌మ‌స్య ఉంటే.. ఎన్నిక‌ల తర్వాతే చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని.. పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల‌కు ఎవ‌రైనా క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని చంద్ర‌బాబు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో ఎంపీ స‌హా అంద‌రూ లైన్‌లోకి వ‌చ్చేశారు. పార్టీ అభివృద్ధికి, పార్టీ నేత‌ల గెలుపుకోసం కృషి చేస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి చంద్ర‌బాబు.. వెంట‌నే స్పందించ‌డంతో బెజ‌వాడ‌లో చెల‌రేగిన టీడీపీ యుద్దం వెంట‌నే స‌ర్దుమ‌ణ‌గ‌డం గ‌మ‌నార్హం.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)