మాజీమంత్రి, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎంఎల్ఏగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గంటా గెలిచినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇదే సమయంలో వైసీపీలో చేరటానికి మాజీమంత్రి విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారానికీ కొదవలేదు. అప్పుడప్పుడు బీజేపీలో చేరబోతున్నట్లు కూడా ప్రచారం అందరికీ తెలిసిందే.
గడచిన ఏడాదిన్నరగా ఇలాంటి ప్రచారాలు చాలానే జరుగుతున్నా గంటా మాత్రం ఎప్పుడూ బహిరంగంగా నోరిప్పలేదు. అలాంటిది తాజాగా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతో గంటా నోరిప్పాల్సొచ్చింది. గంటా ప్రధాన మద్దతుదారుల్లో ఒకరైన కాశీవిశ్వనాధ్ అండ్ కో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ గంటా కొన్ని ప్రతిపాదనలు పంపారన్నారు. వాటిని జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారని చెప్పారు. జగన్ గనుక గ్నీన్ సిగ్నల్ ఇస్తే గంటా కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందన్నారు.
విజయసాయి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనమైంది. ఎందుకంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతున్న సమయంలో వ్యాఖ్యలు చేయటంతో సహజంగానే బాగా వైరల్ అయ్యాయి. దాంతో గంటా తప్పనిసరిగా స్పందిచాల్సొచ్చింది. తాను జగన్ ముందు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు. తనకసలు వైసీపీలో చేరే ఉద్దేశ్యమే లేదని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు.
అధికారంలో తప్ప ప్రతిపక్షంలో కూర్చోవటానికి గంట ఏమాత్రం ఇష్టపడరనే ప్రచారం అందరికీ తెలిసిందే. దీంతోనే గంటా వైసీపీలో చేరటానికి తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నారట. అలాంటిది విజయసాయి ప్రకటనకు గంటా ఇచ్చిన కౌంటర్ ఇఫుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు గంటా ప్రతిపాదనలు పంపింది నిజమేనా ? పంపకపోతే పంపినట్లు విజయసాయి ఎందుకు చెప్పారనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. గంటా ఏమో విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కొట్టిపారేశారు. మరి తాజాగా మొదలైన గంటా పంచాయితి ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates