అతడో యూట్యూబ్ స్టార్. గూగులమ్మలో అతడి పేరు కొట్టినంతనే.. యూట్యూబ్ లో బోలెడన్నివీడియోలు కనిపించేస్తాయి. యూత్ లో మాంచి పేరును సొంతం చేసుకోవటమే కాదు.. వచ్చే బిగ్ బాస్ షోకు అల్రెడీ ఎంపికైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాంటోడు ఎంత బాధ్యతగా.. మరెంత పద్దతిగా వ్యవహరించాలి? అందుకు భిన్నంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్ గా తాగేసి బీభత్సాన్ని సృష్టించాడు. ఇంతకీ అంత రచ్చ చేసిన ఆ యూట్యూబ్ స్టార్ ఎవరో కాదు.. షణ్ముఖ్ జస్వంత్.
ఫుల్ గా తాగేసి.. ఆ మైకంలో వేగంగా కారును నడపటమే కాదు.. విచక్షణ కోల్పోయి.. నియంత్రణ మిస్ అయి మూడు కార్లను ఢీ కొట్టేసిన తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. శనివారం రాత్రి వేళలో బాగా తాగేసిన జస్వంత్.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 10లో అతి వేగంతో కారును నడిపాడు. అతడి దెబ్బకు మూడు కార్లు.. ఒక టూవీలర్ వాహనదారుడు బాధితులుగా మారిపోయారు.
రోడ్డు మీద అతడు చేసిన రచ్చతో అలెర్టు అయిన పోలీసులు.. అతడ్ని.. అతడి కారును తమ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయగా 170 రీడింగ్ వచ్చినట్లుగా తేలింది. డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అతడి అతి కారణంగా ప్రమాదానికి గురైన టూవీలర్ వాహనదారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకున్న వారు.. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరించిన తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates