టీటీడీకి రూ.10 కోట్లు ఇస్తున్న వీరెవరో అర్థమైందా?

ఈ ఫోటోను జాగ్రత్తగా గమనించండి. ఇందులోని ఇద్దరు సుపరిచితులు. మరో ఇద్దరివి కొత్త ముఖాలు. అయితే..ఈ ఇద్దరు పారిశ్రామిక వర్గాల్లో సుపరిచితులు. సామాన్యులకు వీరెవరో పెద్దగా తెలీదు కానీ వీరు ప్రభుత్వాల్నే ప్రభావితం చేయగలిగిన సత్తా ఉంది.

తాజాగా తిరుమలేశుడికి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన ఈ పెద్ద మనసు ఉన్న వారు.. రాబోయే రోజుల్లో ఏపీని ఉద్యమబాటలో నడిచేలా చేయటం ఖాయమన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. సంబంధం లేకుండా ఈ మాటలేంది? శ్రీవారికి రూ.10కోట్లు విరాళం ఇవ్వటం ఏమిటి? పారిశ్రామిక దిగ్గజాలేమిటి? ఏపీ ప్రజలు ఉద్యమ బాట పట్టేందుకు కారణం కావటం ఏమిటి? లింకు లేనట్లుగా అనిపిస్తుందా? అసలు వివరాలు తెలిస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది.
ఈ ఫోటోలోని నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. మరొకరు టీటీడీకి చెందిన వారే. ఇక.. ఫోటోలోని జంట గురించి చెప్పుకోవాలి.

సంప్రదాయ దుస్తుల్లో.. ఎరుపు రంగు కండువాను ధరించిన ఈ పెద్ద మనిషి సో.. పవర్ ఫుల్. ఎవరంటారా? పోస్కో పేరు విన్నారు కదా? ఆ సంస్థ సీఈవో సంజయ్ పాసి. మరొకరు ఆయన సతీమణి షాలిని. పారిశ్రామిక వర్గాలకు సుపరిచితులైన వారు తాజాగా తిరుమలకు వచ్చారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు గ్రూపు తరఫున రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న పోస్కో.. ఇప్పటికే కదపాల్సిన పావుల్ని కదిపినట్లుగా చెబుతున్నారు. అంతలోనే.. ఏపీ అన్నా.. ఏపీలోని దేవుళ్ల అన్నా తమకున్న భక్తిని ప్రదర్శించేందుకు కాస్త రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది.

తెలుగు ప్రజలకు ఇష్టదైవమైన తిరుమలేశుడంటే తమకెంత అభిమానం ఉందన్న విషయాన్ని తాజాగా ఇచ్చిన భారీ విరాళంతో చెప్పకనే చెప్పేశారు. ప్రజల ఆశల్ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్న పోస్కో.. అంతకు ముందు స్వామి వారికి రూ.10 కోట్ల విరాళాన్ని ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలన్నట్లుగా అనిపించక మానదు.

ఒడిశాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి.. భారీ ఎత్తున వ్యాపారం చేయాలని భావించటం.. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి తమ ఆకాంక్షల్ని నెరవేర్చుకోవటం గతం. గూగుల్ లోకి వెళ్లి వెతికినా ఆ వివరాలన్ని కనిపిస్తాయి. పోస్కో ఎంత శక్తివంతమైనదన్న విషయాన్ని గూగులమ్మ చెప్పేస్తుంది. అలాంటి కార్పొరేట్ సంస్థ కన్ను ఏపీ పైన పడింది. ఈ క్రమంలో ఆంధ్రుల హక్కును తమ సొత్తుగా మార్చుకోవాలన్న ప్రయత్నాన్ని షురూ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కుపై ఉద్యమాలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఇది రాజకీయ రగడగా మారటమే కాదు.. తమ హక్కుల సాధన కోసం ప్రజలు రోడ్కెక్కే అవకాశాలే ఎక్కువ. సంప్రదాయ దుస్తులతో.. ప్రశాంత చిత్తంతో శ్రీవారికి రూ.10 కోట్లు ఇచ్చిన ఈ జంట రానున్న రోజుల్లో ఏపీలో చోటు చేసుకునే పలు ఘటనలకు సాక్ష్యంగా నిలుస్తారని చెప్పక తప్పదు.