టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందా? ఆయనపై ఎవరైనా..ఎక్కడైనా భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందా? అంటే.. తాజాగా ప్రభుత్వ సలహాదారు.. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి.. ఔననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సజ్జల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబుపై ఎవరైనా దాడులకు పాల్పడితే..తమకు సంబంధం లేదని.. ఆయన చెప్పేశారు. అంటే.. దీనిని బట్టి.. బాబుపై దాడులు జరిగే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగడం సహా బెదిరింపులకూ పాల్పడుతున్నారని.. ఆయన మాటలకు బాధపడి ఎవరైనా ప్రతిస్పందిస్తే తమకు సంబంధం లేదని సజ్జల ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఓటమిపాలైనప్పటి నుంచి చంద్రబాబుకు వయసు పెరగడం వల్ల వచ్చిన మార్పులు.. ఇతర కారణాలతో వ్యక్తిగత దూషణకు దిగుతూ జుగుప్సాకరమైన భాషను ప్రయోగిస్తున్నారని అన్నారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందపైనా ఇష్టారీతిన మాట్లాడారని ఆక్షేపించారు. ఆయన హత్యా రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు.
సీఎం జగన్ స్వరూపానంద పీఠానికి వెళ్తుంటే.. ఐఏఎస్లు, ఐపీఎస్లు అక్కడకే వెళ్తున్నారని.. ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శలు చేయడం ఏమిటని సజ్జల నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన సందర్భంగా.. వైసీపీ ముఖ్యనేతలపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా బెదిరింపులకు దిగుతున్నారని.. ఇదే భాషను ఉపయోగిస్తే.. ఎవరికైనా బాధ కలిగి ప్రతిస్పందిస్తే ప్రభుత్వానికేమీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. మొత్తానికి సజ్జల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎప్పుడూ లేనిది .. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే.. దీనివెనుక ఏదైనా భారీ స్కెచ్ ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, చంద్రబాబుకుప్పం పర్యటనను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నాయకులు రెండు రోజుల ముందు నుంచే ఆందోళనలను చేస్తున్నారు. వీరిని నిలువరించాలని.. చంద్రబాబు పర్యటనకు అడ్డు రాకుండా చూడాలని టీడీపీ నాయకులు.. పోలీసులకు ఫిర్యాదులు చేసినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు సజ్జల చంద్రబాబుపై ఏదైనా జరిగితే.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని బట్టి.. చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ విశాఖ పర్యటన సమయంలో ఇలానే చంద్రబాబును అడ్డగించి భౌతిక దాడులకు కొందరు ప్రయత్నించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates