విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చురుగ్గా స్పందించారో తెలిసిందే. వెంటనే అమరావతి నుంచి విశాఖకు బయల్దేరారు. బాధితుల్ని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. తక్షణం భారీగా నష్టపరిహారం ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. విశాఖ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయింది 11 మంది.
ఐతే గత ఏడాది జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఏపీలో ఓ పెద్ద ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరిలో విహారం కోసం వెళ్లిన 80 మంది దాకా బోటుతో సహా మునిగిపోయారు. అందులో అటు ఇటుగా ఓ 30 మంది దాకా బయటపడ్డారు. దాదాపు 50 మంది నీటిలో సజీవ సమాధి అయ్యారు. ఐతే అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ స్పందించిన తీరు విమర్శలకు దారి తీసింది.
ఇప్పుడు వైజాగ్ ఘటనలో మాదిరి జగన్ నుంచి సత్వర స్పందన లేకపోయింది. అందుకు తగ్గట్లే గోదావరిలో సహాయ చర్యలు చేపట్టడంలోనూ అధికార యంత్రాంగం అంత చురుగ్గా స్పందించలేదు. మృతదేహాల్ని కూడా చాలా ఆలస్యంగా బయటికి తీశారు. కానీ విశాఖపట్నం ఉదంతంలో మాత్రం అన్నీ యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. జగన్ కూడా తక్షణం స్పందించారు.
మరి గోదావరికి, విశాఖకు తేడా ఏంటి అనే ప్రశ్న తలెత్తిందిపుడు. ఇందుక్కారణం విశాఖకు రాజధానిని మార్చాలన్న జగన్ పట్టుదలే అన్నది విశ్లేషకుల మాట. కరోనా వైరస్ విషయంలోనూ వైజాగ్‌ను రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ కనిపించింది. ఇక్కడ కరోనా కేసుల్ని తగ్గించి చూపే ప్రయత్నమూ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు గ్యాస్ లీక్ ఉదంతం విషయంలోనూ జగన్ చొరవ చూసి ఇక్కడికి రాజధాని మార్చే విషయంలో పట్టుదలతో ఉన్న జగన్.. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.