ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నివ్వం

ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో లోక‌ల్ ఫీలింగ్ పెద్ద‌గా క‌లిగించ‌ని వాటిలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఒక‌టి. చెన్నై సూప‌ర్ కింగ్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబ‌యి ఇండియ‌న్స్ మాదిరి స్థానికంగా ఇది అంత బ‌లంగా లేద‌న్న‌ది వాస్త‌వం. త‌మిళ‌నాడుకు చెందిన స‌న్ టీవీ వాళ్ల ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఈ ఫ్రాంఛైజీలో ఆట‌గాళ్లు కూడా అంతా నాన్ లోక‌లే.

వేరే ఫ్రాంఛైజీల్లోనూ నాన్ లోక‌ల్ ఆట‌గాళ్లే ఎక్కువ ఉంటారు కానీ.. ఇక్క‌డి అభిమానుల‌తో క‌నెక్ట్ అయ్యేలా లోక‌ల్ ఆటగాళ్లు ఒకరో ఇద్ద‌రో అయినా ఉండాల‌ని స‌న్‌రైజ‌ర్స్ ఆలోచించ‌ట్లేదు. ఒక్క‌రంటే ఒక్క‌రికి కూడా స్థానిక ఆట‌గాడికి జ‌ట్టులో చోటు క‌ల్పించ‌లేదు. మ‌హ్మ‌ద్ సిరాజ్ లాంటి ఒక‌రిద్ద‌రు కూడా వేరే ఫ్రాంఛైజీల‌కు ఆడుతున్నారు. ఇదే విష‌య‌మై ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. స్థానిక క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను అంత తేలిగ్గా వ‌దిలిపెట్ట‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

స్థానిక ఆట‌గాళ్ల‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప‌ట్టించుకోనందుకు గాను హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని దానం అన్నారు. హైదరాబాద్‌లో ప్ర‌తిభావంతులైన క్రికెట‌ర్లు చాలామంది ఉన్నార‌ని, కానీ వారిలో ఒక్క‌రికి కూడా లోక‌ల్ ఐపీఎల్ టీంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డం అన్యాయ‌మ‌ని దానం అన్నారు.ఇటీవ‌ల జ‌రిగిన వేలంలో హైద‌రాబాద్ ఆట‌గాళ్ల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌న్నారు.

ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెటర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తన జట్టులోకి తీసుకోవాలని, లేదంటే పేరు మార్చుకోవాల‌ని ఆయ‌న అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన డేవిడ్ వార్న‌ర్‌ను స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్‌గా పెట్టుకోవ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఐతే వార్న‌ర్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడ‌న్న దానం అభియోగం త‌ప్పు. అత‌ను బాల్ టాంప‌రింగ్ కుంభ‌కోణంలో భాగ‌మైనందుకు ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌కు కూడా ఒక ఏడాది దూరంగా ఉండి తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చి అద్భుతంగా స‌న్‌రైజ‌ర్స్‌ను న‌డిపిస్తున్నాడు.