ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంతపార్టీ నేతలకే పెద్ద షాక్ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తు కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై గడచిన 15 రోజులుగా విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఉక్కు ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళనలకు రాజకీయపార్టీలు కూడా జత కలిశాయి. అధికార, ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నా బీజేపీ+జనసేన మాత్రం ఎక్కడా కనబడటం లేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించింది కాబట్టి రాష్ట్రంలో బీజేపీ నేతలు ఆందోళనలంటే జనాలు నవ్వుతారు. అందుకనే నేరుగా ఢిల్లీకి వెళ్ళి ప్రైవేటీకరణను నిలిపేస్తామంటూ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో భీకర ప్రకటన చేశారు. అయితే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నడ్డాతో భేటి అయినపుడు పెద్ద షాక్ తగిలింది. తనతో పార్టీకి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించాలని స్పష్టంగా చెప్పేశారు.
అయినా ఉక్కు ఆందోళనల గురించి వీర్రాజు ప్రస్తావించేందుకు చేసిన ప్రయత్నాలను నడ్డా అడ్డుకున్నారు. పార్టీ వ్యవహరాలుంటే తనతో మాట్లాడమని ఇతర అంశాలు ఏవైనా మాట్లాడాలంటే సంబంధిత మంత్రులతో మాత్రమే చర్చించమని రెండోసారి గట్టిగా చెప్పారట. డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలు తనతో మాట్లాడినా ఎలాంటి ఉపయోగం ఉండదని కూడా నడ్డా స్పష్టంగా చెప్పేశారట. తాను ఏ మంత్రిత్వశాఖ విషయాల్లో జోక్యం చేసుకునేది లేదని చెప్పటంతో నేతలకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు.
నిజానికి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో నరేంద్రమోడిదే ఫైనల్ డెసిషన్. మోడి తీసుకున్న నిర్ణయంపై మంత్రులను కలిసినందువల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ విషయం తెలిసి కూడా వీర్రాజు అండ్ కో డ్రామాలాడుతున్నారు. మోడిని కలిసి మాట్లాడేంత సీన్ మన నేతలకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏదేదో చేసేస్తామని చెప్పి ఢిల్లీకి వెళ్ళిన కమలనాదులకు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.