రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, వైసీపీ కీలక నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై క్రిమినల్ కేసు నమోదుకానుంది. ఐపీసీ సెక్షన్లు 504, 505, 506ల కింద మంత్రి నానిపై తక్షణం కేసులు నమోదు చేయాలని కృష్ణాజిల్లా ఎస్పీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. దీంతో హుటాహుటిన అధికారులు రంగంలోకి దిగారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఎస్ ఈసీ.. నిమ్మగడ్డ.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేసినా.. సహించారు. అదేసమయంలో తనకు రాజకీయ రంగు పులిమినా సహించారు. అయితే.. దీనికి మించి.. అన్నట్టుగా.. జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కూడా తప్పుపట్టేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిమ్మగడ్డ తాజాగా ఆదేశించడం సంచలనంగా మారింది.
కొడాలి నాని వర్సెస్ నిమ్మగడ్డ వ్యవహారం.. కేవలం 24 గంటల్లో వ్యూహాత్మక మలుపు తిరిగింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కమిషనర్‌కు దురుద్దేశాలు ఆపాదించడంతోపాటు అనేక ఆరోపణలు, విమర్శలు చేసినందుకు పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మంత్రి కొడాలి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. ఈ మేరకు కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 21 వరకు మంత్రి నాని బహిరంగ సభల్లోనూ, గ్రూపు సమావేశాల్లోనూ మాట్లాడకుండా నిషేధం విధించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. వీటిని అమలు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్సీ, విజయవాడ పోలీసు కమిషనర్‌లను నిర్దేశించారు.
ఇక, శుక్రవారం ఉదయం నుంచే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొడాలి నాని ఉదయం తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి.. నిమ్మగడ్డను, చంద్రబాబును తిట్టిపోశారు. చంద్రబాబు-నిమ్మగడ్డ వేరు వేరు కారని.. సామాన్యులను అడిగినా.. ఈ విషయం చెబుతారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విమర్శలపై స్పందించిన ఎస్ఈసీ.. ఆయనకు షోకాజ్ నోటీసు పంపించింది.
సాయంత్రానికి మంత్రి తన వివరణను న్యాయవాది ద్వారా పంపించారు. ఎస్ఈసీ అంటే తనకు గౌరవమే అని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణపై ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. పైగా ప్రెస్‌మీట్‌లో చేసిన ఆరోపణలు, విమర్శలను ఆయన వెనక్కి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో తెల్లవారే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. కొడాలిపై ఏకంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. కేసులు నమోదు చేయాలని ఆదేశించడం గమనార్హం. మరి ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates