ఈ ఎన్నికలతో జననాడి దొరుకుతుందా ?

తొందరలోనే రెండు శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసింది. రెండు ఎంఎల్సీ స్ధానాలు కూడా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లోనే జరగబోతోంది. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక స్ధానం, తూర్పు+పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకస్ధానానికి ఎన్నిక జరగబోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు జరుగుతున్న పంచాయితి ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు గెలిచినా పార్టీ బ్యానర్ ఉండదు. అయితే గెలిచిన వాళ్ళంతా తమ వాళ్ళే అని క్లైం చేసుకునే అవకాశం ప్రతి పార్టీకి ఉంటుంది. కాకపోతే అధికారపార్టీకి బాగా ఎక్కువ అవకాశం ఉంటుందంతే. ఇపుడు జరుగుతున్న క్లైం కూడా ఇలాంటిదే. తమకు 38 శాతం ఓట్లు వచ్చిందని చంద్రబాబునాయుడు చెబుతుంటే కాదు కాదు టీడీపీకి వచ్చింది 16 శాతమే అని వైసీపీ అంటోంది.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జరగబోయే ఎంఎల్సీ ఎన్నికలో ఎలాగూ పార్టీ బేసుడే జరుగుతుంది. అందునా కృష్ణా-గుంటూరులో ఒకస్ధానం ఉండటమే ఆసక్తిగా మారింది. పై రెండు జిల్లాలు రాజధాని జిల్లాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి రాజధాని అమరావతిలో గడచిన 400 రోజులుగా స్ధానికులు+రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి దీని ప్రభావాన్ని కూడా ఎవరికి వారుగా తమిష్టం వచ్చినట్లు లెక్కేసుకుంటున్నారు.

ఈ పరిస్ధితుల్లో పార్టీ బ్యానర్ పై జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సత్తా చాటుతారా ? అన్నది కీలకంగా మారింది. ఇపుడు పంచాయితి ఎన్నికల్లో రాజధాని 28 గ్రామాలను మినహాయించారు కాబట్టి జనాల తీర్పు ఏమిటో తెలీలేదు. మరి వచ్చే నెలలలోనే జరగబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో జనాలు తమ తీర్పును స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. కాబట్టే ఇప్పటి నుండే వైసీపీ, టీడీపీతో పాటు జనసేన+బీజేపీ కూడా కసరత్తు మొదలుపెట్టేశాయి. చూద్దాం ఎన్నిక ఎంత రసవత్తరంగా సాగుతుందో.