అక్క‌డ టీడీపీ ఈ రేంజ్‌లో పుంజుకుంటుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు!!

రాష్ట్రంలో జ‌రుగుత‌న్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా..చంద్ర‌బాబు.. ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో సైకిల్ ప‌రుగులు పెట్టింది. అస‌లు అడ్ర‌స్ కూడా ఉంటుందో ఉండ‌దో అని అనుకున్న క‌డ‌ప‌లో ఆశించిన విధంగానే టీడీపీ ఫ‌లితాలు రాబ‌ట్ట‌డంతో.. చంద్ర‌బాబు స‌హా అంద‌రూ ఊపిరి పీల్చుకోవ‌డం గ‌మ‌నార్హం. గత ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీ కీల‌క నేత‌లు క‌డ‌ప‌లో హ్యాండిచ్చారు. సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి వంటివారు.. పార్టీ నుంచి జంప్ చేశారు.

దీంతో క‌డ‌ప‌పై చంద్ర‌బాబు.. పూర్తిగా ఆశ‌లు వ‌దులుకున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోక‌స్ పెంచిన చంద్ర‌బాబు.. ఒక్క క‌డ‌ప‌పై మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. క‌డ‌ప‌పై దృష్టి పెట్టే.. చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు. అయితే.. అనూహ్యంగా పంచాయ‌తీ తొలిద‌శ ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో టీడీపీ మ‌ద్ద‌తు దారులు విజ‌యం సాధించారు. ఏకగ్రీవాలు పోనూ 155 సర్పంచి స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరిగితే టీడీపీ మద్దతుదారులు 98 స్థానాలకు పోటీ చేశారు. 27 స్థానాల్లో విజయం సాధించారు.

ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వ‌చ్చిన ఫ‌లితాలు.. టీడీపీ శ్రేణుల్లోనే కాదు.. చంద్ర‌బాబులోనూ ఆనందాన్ని నింపాయి. అస‌లుఏమీలేద‌ని చేతులు ఎత్తేసిన‌.. క‌డ‌ప‌లో ఇలాంటి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని వారు ఊహించ‌లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 19 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ మద్దతుదారులు 5 స్థానాల్లో గెలిచారు. బద్వేలు నియోజకవర్గంలో 68 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 12 స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థులు విజయం సాధించారు. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు 46 స్థానాల్లో పోటీ చేసి 10 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మొత్తానికి ఊహించ‌ని జిల్లాలో అనూహ్య ఫ‌లితం రావ‌డం.. సైకిల్ ప‌రుగులు పెట్ట‌డం టీడీపీలో కొత్త జోష్ పెంచింద‌నే చెప్పాలి.