ఒకపుడు యుద్ధాల్లో సంధి చేసుకోవాలని అనుకున్నపుడు శతృవులు తెల్లజెండాను చూపిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత విషయానికి వస్తే కొద్ది రోజులుగా ఉప్పు-నిప్పులాగున్న ప్రభుత్వం యంత్రాంగం, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ మధ్య కూడా సయోధ్య కుదిరినట్లే ఉంది. ఎందుకంటే పంచాయితి ఎన్నికల మొదటి విడతలో యంత్రాంగం బాగా పనిచేసిందని నిమ్మగడ్డ ప్రశంసిచారు.
తొలిదశ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నిమ్మగడ్డ అభినందించారు. ఇదే చీఫ్ సెకట్రరీకి నిమ్మగడ్డకు మధ్య ఎన్నిసార్లు లేఖల యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ యుద్ధం కూడా చాలా తీవ్రస్ధాయిలోనే జరిగింది. తన ఆదేశాలను పాటించాల్సిందే అని నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయటం ఆ ఆదేశాలు ఇచ్చే అధికారం నిమ్మగడ్డకు లేదని కొన్ని సందర్భాల్లో చీఫ్ సెక్రటరీ రిప్లై ఇవ్వటం అందరికీ తెలిసిందే.
మొత్తం మీద ఉప్పు-నిప్పు లాగున్న చీఫ్ సెక్రటరి, నిమ్మగడ్డ మధ్య ఆహ్లదకరమైన వాతావరణంలో భేటి జరిగింది. ఈ భేటీలో డీజీపీతో పాటు కొందరు అధికారులు పాల్గొన్నారు. మిగిలిన మూడు విడతల పంచాయితి ఎన్నికల నిర్వహణపై చేసిన చేయాల్సిన ఏర్పాట్లపై భేటీలో చర్చించినట్లు సమాచారం. ఏకపక్షంగా నిమ్మగడ్డ ఇచ్చిన కొన్ని ఆదేశాలను అమలు చేయటానికి చీఫ్ సెక్రటరీ నిరాకరించిన విషయం అందరికీ తెలిసిందే.
మొత్తం మీద మార్చి నెల 31వ తేదీన రిటైర్ అవుతున్న నిమ్మగడ్డ కు తత్వం బోధపడినట్లే ఉంది. ప్రభుత్వ యంత్రాంగం సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదని అర్ధమైపోయింది. దానికితోడు కోర్టుల్లో కూడా వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బల వల్ల కూడా నిమ్మగడ్డ తన రూటును మార్చుకున్నట్లున్నారు. కారణాలు ఏమైనా సుహ్రుద్భావ వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకోవటం తప్పేకాదు.