వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి స్పీడు గురించి అందరికీ తెలిసిందే. 2014 నుండి విజయసాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అప్పటి అధికార ఇఫ్పటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును అయినా ఇతర ప్రతిపక్ష నేతలను అయినా విమర్శించటంలో చాలా అత్యుత్సాహం చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేష్, యనమల+జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి వాళ్ళను ఉద్దేశించి దాదాపు ప్రతిరోజు ట్విట్ట్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు.
రాజకీయ నేతలను వదిలిపెట్టేస్తే కొద్దిరోజులుగా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్+చంద్రబాబును ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, సంధిస్తున్న కామెంట్లు అందరు చూస్తున్నదే. అలాంటిది విజయసాయి తాజాగా పార్లమెంటులో క్షమాపణలు చెప్పుకున్నారు. రాజ్యసభలో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఉద్దేశించి కాస్త తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ‘మనిషి ఒకచోట మనసంతా టీడీపీ వైపే’ ఉందంటు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.
టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్ర విషయంలో తాను చేసిన ఫిర్యాదుపై వెంకయ్య చర్యలు తీసుకోలేదన్న మంటతోనే విజయసాయి పై వ్యాఖ్యలు చేశారు. అయితే సభలో మాట్లాడుతూ చాలా యధాలాపంగా వ్యాఖ్యలు చేసేశారు. చంద్రబాబు, పవన్, నిమ్మగడ్డపై వ్యాఖ్యలు, ఆరోపణలు చేసినంత తేలిగ్గా ఉపరాష్ట్రపతిపైన కూడా ముందు వెనక చూడకుండా నోటికొచ్చింది మాట్లాడేశారు.
తాను దూషిస్తున్నది, ఆరోపణలు చేస్తున్నది వెంకయ్యనాయుడుపైన కాదు ఉపరాష్ట్రపతిపైన అన్న విషయాన్ని విజయసాయి మరచిపోయారు. దాంతో ఎంపి వ్యాఖ్యలపై కొందరు ఎంపిలు తీవ్రంగా మండిపడ్డారు. విజయసాయిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటు డిమాండ్ చేశారు. దాంతో సమస్య ముదిరి పాకాన పడకుండానే విజయసాయి మేల్కొన్నారు. వెంటనే సభలోనే ఉపరాష్ట్రపతికి క్షమాపణ చెప్పుకున్నారు. మొత్తానికి అనాలోచితమో లేకపోతే ఉద్దేశ్యపూర్వకంగానే బురద చల్లేసిన ఎంపి తర్వాత తానే ఆ బురదను కడగటంతో వివాదం ముగిసింది.