ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. సంచలన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వరకు హౌస్ అరెస్టు చేయాలని.. డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశిస్తూ.. ప్రొసీడింగ్స్ జారీ చేశారు. మంత్రి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఎస్ఈసీ తేల్చిచెప్పింది. ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ పేర్కొనడం గమనార్హం.
ఇక, ఇదేసమయంలో తమకు ఈ అధికారం ఉందా? లేదా? అనే విషయంలోనూ నిమ్మగడ్డ క్లారిటీ ఇచ్చారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు.. ఇతర రాష్ట్రాల్లో ఎస్ ఈసీ తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకునే తాము ఈ విధంగా వ్యవహరించామని.. నిమ్మగడ్డ పేర్కొనడం గమనార్హం. ఇక, మంత్రి విషయానికి వస్తే.. ఇటీవల రెండు రోజులుగా పెద్దిరెడ్డి.. కొంతమేరకు దూకుడుగానే ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి దృష్టంతా నిమ్మగడ్డపైనే ఉంది. ఇటీవల పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్ లిస్ట్‌లో పెడతాం. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం’ అని హెచ్చరించారు. దీంతో ఈ పరిణామం.. అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు మధ్య తీవ్ర సంకటంగా మారింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ తాజాగా మంత్రి పెద్దిరెడ్డిని నిలువరిస్తూ.. ఈ నెల 21 వరకు ఇంటి నుంచి కదలనీయరాదని ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates