కరోనా వ్యాప్తిని నివారించేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నెలన్నర రోజులుగా ప్రజా రవాణా ఆగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్లు ప్రభుత్వ అనుమతులతో సొంత వాహనాలు పెట్టుకుని.. లేదా ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా స్వస్థలాలకు చేరే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు.
ఐతే ఇంత కష్టపడలేక సాధారణ ప్రజా రవాణా ఎప్పుడు పునరుద్ధరిస్తారా అని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభ వార్త చెప్పారు. త్వరలోనే ప్రజా రవాణాను మొదలుపెట్టడానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బహుశా మే నెలలోనే బస్సులు, రైళ్లను పాక్షికంగా అయినా పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ మార్గదర్శకాలు ఉండబోతున్నాయని చెప్పారు. ఈ మేరకు కారు, బస్సు ఆపరేటర్స్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
రవాణా రంగానికి సంబంధించి వచ్చిన బెయిల్ఔట్ ప్యాకేజీ గురించి ప్రస్తావనకు రాగా.. ఈ రంగంలో ఉన్న అన్ని సమస్యలూ తనకు తెలుసని గడ్కరీ అన్నారు. రవాణా రంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా రవాణాకు లండన్ మోడల్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు పునః ప్రారంభయ్యాయని గడ్కరీ తెలిపారు. మే 17న కేంద్రం ప్రకటించిన మూడో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రజా రవాణా పునఃప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.