తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి రూటు కాస్త సపరేటుగా ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు చాలా భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కుర్రాళ్లకు ధీటుగా హుషారుగా వ్యవహరిస్తారు. తాను మంత్రినన్న భావన పెద్దగా కనిపించనివ్వడు. పిల్లల్లోఉన్నప్పుడు వారితో కలిసి పోవటం.. పెద్దలతో కూర్చున్నప్పుడు పెద్ద మనిషిగా వ్యవహరించటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి మల్లారెడ్డి తాజాగా ఒక పాత బజాజ్ చేతక్ స్కూటర్ మీద మనసు పడ్డారు.
సదరు స్కూటర్ ను తనకు అమ్మాలని కోరారు. అందుకు.. స్థానిక వ్యాపారి నో చెప్పేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ మంత్రి మల్లారెడ్డికి ఆ పాత చేతక్ స్కూటర్ మీద అంతలా మనసు ఎందుకైనట్లు? అంటే.. విషయం సినిమాటిక్ గా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడంటే మంత్రి మల్లారెడ్డికి కాలేజీలు.. వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. మొదట్లో ఆయన పాల వ్యాపారం చేసేవారు.
విపరీతంగా కష్టపడి.. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టారు.పాలు అమ్మే సమయంలో ఆయన ఒక చేతక్ మీద తిరిగేవారు. ఆ స్కూటర్ ను గతంలో ఒక వ్యాపారికి అమ్మగా.. ఆ వ్యాపారి మరో వ్యాపారికి అమ్మారు. తాజాగా తన పాత స్కూటర్ కనిపించేసరికి మంత్రి మల్లారెడ్డిలో ఎక్కడలేని హుషారు వచ్చేసింది. అప్పట్లో తనకు ఎంతో కలిసి వచ్చిన ఆ స్కూటర్ ను చూసి సంతోషపడిన ఆయన.. దాని మీద ఎక్కి కాసేపు నడిపించారు.
తనకు అప్పట్లో లక్కీగా ఉన్న స్కూటర్ ను తనకు తిరిగి అమ్మాల్సిందిగా సదరు వ్యాపారిని కోరారు. అయితే.. సదరు వ్యాపారి మంత్రి మాటను సున్నితంగా రిజెక్టు చేశారు. ఆ స్కూటర్ కొన్న తర్వాతే తనకు వ్యాపారంలోకలిసి వచ్చిందని.. తాను ఆ స్కూటర్ అమ్మలేనని చెప్పారు. మొత్తానికి మంత్రి కోరుకున్నట్లుగా స్కూటర్ సొంతం కాకున్నా.. పాత గురుతుల్లోకి వెళ్లిన ఆయన.. స్కూటర్ ను చూసి తెగ సంతోషాన్ని వ్యక్తం చేయటం.. అక్కడి వారిని ఆకర్షించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates