రాజకీయ పార్టీలకు కార్యకర్తలు, నాయకుల బలం అత్యంత ముఖ్యం. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. గెలుపునే కాదు.. పార్టీని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే.. ఈ రెండు విషయాల్లోనే కాదు.. ఆర్థికంగా కూడా తెలుగు దేశం పార్టీ బలంగానే ఉందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. పార్టీకి ఇటు ఆన్‌లైన్ వేదికగా.. 10 లక్షల మంది మైటీడీపీ యాప్‌లో నమోదు చేసుకున్నారు. మరోవైపు.. ఆఫ్ లైన్‌లో 1.2 కోట్ల మంది సభ్యత్వాలు కలిగిఉన్నారు. అంటే.. టీడీపీకి అంగబలం ఎలా ఉందో అర్థం అవుతుంది.
ఇక, కేవలం అంగబలమే కాకుండా.. అర్థబలంలోనూ టీడీపీ ముందుంది. ఈ ఏడాది పార్టీ ఆస్తులు, ఆదాయం, ఖర్చుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించింది. దీనిలో అన్ని వివరాలను సమగ్రంగా వివ రించారు. పార్టీకి ఈ ఏడాది లెక్కల ప్రకారం 526 కోట్ల మేరకు ఆస్తులు(ధన రూపంలో) ఉన్నట్టు పేర్కొన్నారు. ఇవి.. పూర్తిగా అన్ని ఖర్చులు పోను.. మిగిలిన సొమ్ముగా పార్టీ వివరించింది. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల కోసం చేసిన బీమా ఖర్చు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇది 46.25 కోట్ల రూపాయలుగా ఉంది.
అలానే.. ఎన్నికల సమయంలో అభ్యర్థులకు ఖర్చుల కింద17 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇలా.. మొత్తం అన్ని ఖర్చులు పోగా.. స్థిరంగా 526 కోట్లరూపాయల మేరకు వివిధ బ్యాంకుల్లో నగదు నిల్వ ఉంది. ఇవి కాకుండా.. స్థిరాస్తులు.. అంటే పార్టీ కార్యాలయాల విలువ మరో 20 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొంది. అయితే.. ఇది ప్రభుత్వ రెవెన్యూ విలువ ప్రకారం వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో మరో 2 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని నాయకులు చెబుతున్నారు.
గత ఎన్నికల సమయంలో పార్టీ ఆస్తులు 320 కోట్లరూపాయలు కాగా.. రెండున్నరేళ్ల కాలంలో పార్టీకి విరాళాల రూపంలో మరో 200 కోట్ల రూపాయల వరకు సమకూరించింది. రెండు సార్లు నిర్వహించిన మహానాడు, రెండు సార్లు నిర్వహించిన సభ్యత్వం కారణంగా ఈ నిధులు సమకూరాయి. మొత్తంగా.. అటు పార్టీ నాయకులు, కార్యకర్తల పరంగానే కాకుండా.. ఇటు ఆర్థికంగా కూడా టీడీపీ ఉన్నతస్థాయిలో ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates